Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తు దారుడితో అధికారుల నిర్లక్ష్యపు సమాధానం
నవతెలంగాణ-బోడుప్పల్
ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకంగా పరిపాలన సాగాలనే లక్ష్యంతో 2005లో అప్పటి సర్కారు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. తద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు అనేది స.హ చట్టం అభిప్రాయం. ఈ చట్టం వచ్చి సుమారు17 సంవత్సరాలు గడుస్తున్న బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మాత్రం ఈ చట్టంపై అవగాహన లేదు అని సమాధానం ఇవ్వడం విడ్డూరంగా ఉందని స.హ. చట్టం కార్యకర్తలు విస్తుపోతున్నారు. వివరాల్లోకి వెళితే మరాటి మల్లేశ్ అనే స.హచట్టం కార్యకర్త బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కొన్ని వివరాలు కావాలని ఏప్రిల్ నెలలో దరఖాస్తు చేశాడు అయితే దీనిపై కార్పొరేషన్ కార్యాలయం నుండి తనిఖీ చేయడానికి గాను తేదీ ఇచ్చారు కార్పొరేషన్ కార్యాలయం అధికారులు ఇచ్చిన తేదీ మేరకు శుక్రవారం నాడు తనిఖీ చేయడానికి వెళ్లగా కేవలం ఒకే ఒక్కరూ తనిఖీ చేయడానికి అనుమతి ఉంటుందని పౌర సమాచార అధికారి మంజులత సమాధానం ఇచ్చారు. అలా కాదు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం దరఖాస్తు దారుడితో పాటు మరి కొందరు తనిఖీలు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలుపగా మాకు ఈ చట్టంపై అవగాహన లేదని సమాధానం ఇవ్వడంతో దరఖాస్తు దారుడితో పాటు, స.హ. చట్టం కార్యకర్తలు విస్తుపోయారు. వెంటనే దరఖాస్తు దారుడు తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను గతంలో తనిఖీలు నిర్వహించిన ఉదాహరణలను సదరు అధికారులకు వివరించడంతో అప్పిలేట్ అధికారి దష్టికి తీసుకుని వెళ్ళారు. అయిన కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వక పోవడంతో మరో రోజు తనిఖీ చేయడానికి లేఖ అందించారు.
ఎందుకీ గోప్యత
పారదర్శకంగా పరిపాలన సాగే కార్యాలయంలోని వివరాలను అందించడంలో అధికారులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారోననే అభిప్రాయం సామాన్య ప్రజలకు కలుగుతుంది. మేడ్చల్ జిల్లాలో అత్యధిక ఆదాయం కలిగిన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేసే అధికారులు ఇక్కడి వ్యవహారాలు, పనులపై అవగాహన లోపంతో పాటు సమన్వయ లోపం ఉంటున్నారనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే వందల సంఖ్యలో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, అనేక మంది స.హ. చట్టం కార్యకర్తలు వాపోతున్నారు. ఒక వేళ అధికారులు సమాచారం ఇచ్చినా అది అరకొరగా ఉంటోందని పేర్కొంటున్నారు.
అలా అనడం సిగ్గు చేటు..
ప్రభుత్వ కార్యాలయాల్లో కీలకమైన విభాగాల్లో పనిచేసే అధికారులకు ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలపై అవగాహన లేదని చెప్పడం సిగ్గు చేటని స.హ. చట్టం కార్యకర్త మరాటి మల్లేశ్, సీసీఅర్ సంఘం సభ్యులు మోహన్ దాస్, శివ, బీమ్లా నాయక్‌లు మాట్లాడుతూ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయంలోని సమాచారాన్ని అడిగితే దానిపై పొంతన లేని సమాధానం చెప్పడంతో పాటు తమకు చట్టం గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేదని చెప్పడం సరికాదని అన్నారు. ఇలాంటి అధికారుల వైఖరి కారణంగానే ప్రభుత్వ కార్యాలయాలపై ప్రజలకు నమ్మకం పోతోందన్నారు. బోడుప్పల్ కార్పొరేషన్ లాంటి చోట్ల వందల సంఖ్యలో స.హ.చట్టం దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం చూస్తుంటే ప్రభుత్వ చట్టాలపై వీరికి ఎలాంటి చిత్తశుద్ధి కూడా లేదనేది స్పష్టమవుతోందన్నారు.