Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జోనల్ రైల్వేలలో 50శాతం నాన్-సేఫ్టీ పోస్టులను సరెండర్ చేస్తూ రైల్వే జారీ చేసిన ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు దాని అనుబంధ సంస్థ, సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రైల్వే ఉద్యోగులు శుక్రవారం దక్షిణ మధ్యరైల్వే పరిధి అంతటా డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సీఆర్ఎంయూ అధ్యక్షులు కే.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, ఏఐఆర్ఎఫ్ కోశాధికారి సి.హెచ్.శంకరరావు మాట్లాడుతూ... భారతీయ రైల్వేలో ఇప్పటికే 3 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రతి సంవత్సరం 2శాతం పోస్టులు తగ్గుతున్నాయని వివరించారు. కోచ్లు, లోకో షెడ్లలో ఇంజన్లు, కొత్తగా విద్యుదీకరించిన లైన్లు, కొత్త లైన్ల నిర్మాణంతోపాటు వివిధ కారణాలతో రైల్వే ఆస్తులు పెరిగినప్పటికీ, ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయడం లేదన్నారు. జోనల్ రైల్వేలలో సిబ్బంది సంఖ్యను తగ్గించడంతో ప్రస్తుతమున్న సిబ్బందిపై పని భారం పెరుగుతుందన్నారు. రైల్వే సంస్థలను ప్రవేటీకరించడం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని చెప్పారు. సులభమైన రిక్రూట్మెంట్ ద్వారా వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.