Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రచనా జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్. ఉమా మహేశ్వర రావు
- జర్నలిజంలో ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సు
నవతెలంగాణ-ధూల్‌పేట్
మెరుగైన సమాజానికి దారి చూపించే దీపంలా జర్నలిజం ఉండాలని రచనా జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్. ఉమా మహేశ్వర రావు అన్నారు. ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ నిర్వహించిన 'జర్నలిజంలో ఉపాధి అవకాశాలు'' అనే అంశంపై అంతర్జాల అవగాహన సదస్సులో వక్తగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సంఘటన గురించి తెలియజేయటమే వార్త కాదని, దానికి సంబంధించిన పూర్వాపరాలను, అందుకు కారణమైన విశేషాలను సవివరంగా విశ్లేషించటమే వార్త అని అన్నారు. జర్నలిజం రంగంలో నిపుణుల కొరత ఉందని, నిత్య అధ్యయనం, నిబద్ధత, సామాజిక, రాజకీయ, ఆర్థిక ఎరుక ఉన్న యువత పాత్రికేయులుగా రాణించవచ్చని ఈ సందర్భంగా అన్నారు. పత్రికా, ప్రసార, ప్రచార మాధ్యమాల్లో అటు ప్రభుత్వ రంగంలోనూ, ఇటు ప్రయివేటు రంగంలోనూ ఉన్న విస్తతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులకు నైపుణ్యాలను సమకూర్చాలని అన్నారు. భావప్రకటన స్వేచ్ఛకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేదే ఉత్తమమైన సమాజమని, అందుకు జర్నలిజం దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తా సరళంగా, క్లుప్తంగా, సర్వసమగ్రంగా ఉండాలని అన్నారు. డిగ్రీ తతీయ సంవత్సరం పాఠ్యప్రణాళికలో జర్నలిజం చేర్చటం మంచి విషయమని, సంపాదకమండలిని ఆయన అభినందించారు.
మానవీయ స్పహ ఉండాలి
సుప్రసిద్ధ పాత్రికేయులు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సి. వనజ మాట్లాడుతూ వార్తా కథనానికి మానవీయ స్పహ అనివార్యంగా ఉండాలని అన్నారు. వార్త కథనం కేవలం ఒక అధ్యయన అంశంగా మిగిలిపోకుండా పాఠకుల్లో, ప్రేక్షకుల్లో స్పందనను కలిగించాలని, కార్యాచరణకు పురికొల్పాలని అభిప్రాయపడ్డారు. వార్తా కథన రచనకు ముందు, దానికి సంబంధించిన అధ్యయనÊ, పరిశోధన ఉంటే అది ప్రభావశీలంగా ఉంటుందని అన్నారు. ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు వ్యక్తి కేంద్రకంగా కాకుండా విషయ కేంద్రకంగా ఉండాలని, పాఠకులకు, ప్రేక్షకులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని అన్నారు. తెలుగు సహాయ ఆచార్యులు డా.కోయి కోటేశ్వర రావు సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో ఎన్. అనంత లక్ష్మి, డా.జె.నీరజ, కేతరీన, సుజాత, డా.కమల సుధారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.