Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం మహంకాళి పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ పార్క్‌లో మరో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు జనవరి 28న స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్‌ని తీసుకు వచ్చినప్పుడు స్వయానా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా ముందు చెప్పారనీ, తాము వ్యతిరేకించిన తర్వాత వెనక్కి తగ్గారనీ, సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదనీ, సుందరీకరణ పేరిట విగ్రహానికి సమీపంలో టాయిలెట్స్‌ను ఏర్పాటు చేస్తామనే దాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. గాంధీ విగ్రహం ఇటలీ నుంచి తెప్పించిన పంచలోహ విగ్రహమన్న విషయం ఇంతకాలం చాలామందికి తెలియదనీ, విగ్రహాన్ని ఎత్తుకుపోతారనే కాదు నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో మంత్రిని సంతోష పెట్టాలని ఎవరైనా కావాలని విగ్రహానికి హాని చేకూర్చే అవకాశమున్నదనీ, తమ అనుమానం అన్నారు. విగ్రహం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి విగ్రహానికి కాపాడాలని కోరారు. ఉజ్జయిని మహాకాళి ఆలయంలో కూడా నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలనీ, ఈ విషయమై మంత్రి కూడా ఆదేశించారనీ, ఆలయ ఈవో దేవాదాయశాఖ కమిషనర్ కు లేఖ రాశారనీ, ఇప్పుడు మంత్రి అమ్మవారి మూలవిరాట్‌ను కదిలించడం లేదంటూ తప్పించుకుంటున్నారన్నారు. ఈవో అబద్ధం చెబుతున్నారా లేక మంత్రి అబద్ధం చెబుతున్నారో అర్థం కావడ లేదన్నారు. ఆలయానికి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వచ్చే విషయం దేవాదాయశాఖ కమిషనర్‌కు తెలియదట, పీఠాధిపతి గర్భాలయంలో ఉన్నపుడు ఆలయ ప్రధాన అర్చకుడికి బయటకు పంపి చండీ పారాయణ దారులైన వేణుమాధవ్ శర్మకు గర్భాలయంలో ఏం పని అని ప్రశ్నించారు. ఇలాంటి అవకతవకలు ఆలయంలో అనేకం జరుగుతున్నందున విగ్రహం ఏర్పాటు విషయంలో మంత్రికి సంబంధం లేకపోతే మంత్రి పేరు వాడుకున్నందుకు మంత్రి ఈఓను ఎందుకు సస్పెండ్ చేయించడం లేదని ప్రశ్నించారు. చండీ పారాయణం చేసి వెళ్లాల్సిన వేణు మాధవ శర్మ పరిధి దాటి ప్రవర్తిస్తున్న ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి శీలం ప్రభాకర్, రాంగోపాల్ పేట్ డివిజన్ అధ్యక్షుడు దయానంద రావు, డివిజన్ అధ్యక్షుడు అంబాల ఈశ్వర్ బాబు, నగర కార్యదర్శి విష్ణు, సీనియర్ నాయకులు సీ.కే.నర్సింగరావు, వెంకట్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.