Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్వాల్‌లో అధికార పార్టీ నాయకుల అక్రమ నిర్మాణాలు
ఎమ్మెల్యే పేరుతో చలామణి
నవతెలంగాణ-నేరెడ్మెట్
''నేను ఎమ్యెల్యే అనుచరుడిని. అధికార పార్టీ వాడిని. ఇది నా స్వంత ఇంటి నిర్మాణం. అన్నీ అన్నకు చెప్పే నిర్మించుకుంటున్న. ఈ విషయం టౌన్ ప్లానింగ్ ఏసీపీ, స్థానిక డివిజన్ కార్పొరేటర్‌కు కూడా తెలుసు. కావాలంటే మీరూ కనుక్కోండి.'' ఇవి స్థానిక ఎమ్యెల్యే అనుచరుడి మాటలు.
అసలేం జరిగిందంటే..
అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ ఖానాజిగూడా భూదేవి నగర్ బృందావన్ కాలనీ దగ్గర పాత ఇంటి మీద మూడు అంతస్థుల భవనం నిర్మిస్తున్నారు. పాత ఇంటి మీద రెండంతస్తులకు పర్మిషన్ ఉందనీ, ఆ పైన ఫ్లోర్‌కి పర్మిషన్ లేదనీ, ఇది స్థానిక ఎమ్మెల్యే, టౌన్ ప్లానింగ్ ఏసీపీ, స్థానిక కార్పొరేటర్‌కి చెప్పి నిర్మిస్తున్నామనీ, కావాలంటే అడగండి అని చెబుతున్నారు.
ఐజీ స్టాచ్యు సర్కిల్లో..
ఎమ్యెల్యేకి మరో ప్రధాన అనుచరుడు అంటూ అల్వాల్ ఐజీ స్టాచ్యు సర్కిల్లో ఎలాంటి సెట్ బ్యాక్‌లు లేకుండా కింద డొమస్టిక్ గల నాలుగు అంతస్తుల భవనం నిర్మించాడు. ఈ భవన నిర్మాణంలో ఉన్నప్పటి నుంచి అధికారులను వివరణ అడుగగా దీని మీద చర్యలు తీసుకుంటున్నాం అనే సమాధానం తప్పా చర్యలు శూన్యం.
మమ్మల్ని పని చేసుకోనివ్వడం లేదు : అధికారులు
తాము ఎమ్యెల్యే అనుచరులం అనీ, స్థానిక నాయకులం అని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా ఏమీ చేయలేకపోతున్నాం. ఏదైనా చర్యలు తీసుకుం దామంటే ఒత్తిడులు, బెదిరింపులు ఎక్కువ అయ్యా యి. కొంతమంది మాకు ఒక రూల్, అధికార పార్టీ వారికి ఒక రూలా? అని ప్రశ్నించినా? మా మీద అవినీతి ఆరోపణలు చేసినా భరిస్తున్నాం. మేం, మాకున్న ఒత్తిడులు ఎవరికి చెప్పుకోవాలో తెలియ డం లేదు. మమ్మల్ని సరిగా పని చేసుకోనివ్వడం లేదు. మేం ఇక్కడ నుంచి మరో చోటికి బదిలీ అయ్యేంత వరకు మాకు ఈ పరిస్థితి తప్పదేమో?
ఒకవైపు ఎమ్యెల్యే బహిరంగ సభల్లో అక్రమ నిర్మాణాలు తన ఇంటి వారు చేపట్టినా ఊరుకోను అని చెబుతున్నా ఆచరణలో మాత్రం కనబడటం లేదు. ఇంటి వారు పక్కనబెడితే అనుచరులే అమ్రణ నిర్మాణాలు చేపడితే అధికార పార్టీ నాయకులు, అనుచరులు ఇలా చేయడం ఎమ్యెల్యేకు తెలుసా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి అక్రమ నిర్మాణాలు జరగకుండా తన అనుచరులతో మాట్లాడాలని స్థానికులు, అధికారులు కోరుతున్నారు.