Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రత కట్టుదిట్టం
- పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకులు గురువారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో అధికారికంగా నిర్వహించను న్నారు. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలు, వీవీఐపీలు, ప్రభుత్వ అధికారులు, పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రముఖులు హాజరు కానుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాం తాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. పాత నేరస్తుల కదలి కలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పబ్లిక్ గార్డెన్స్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు గార్డెన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సివిల్, టాస్క్ఫోర్సు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించుతున్నారు. అదనంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసందానం చేశారు. అక్కడి నుంచే అధికారులు భద్రతను పరిశీలించనున్నారు. అవసరమైతే నేరుగా సిబ్బందికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశిస్తారు. మహిళల భద్రత కోసం అదనంగా షీ టీమ్‌లను రంగంలోకి దించారు.
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్ర ఆవిర్భావదినోత్సవం సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎంజే మార్కెట్, రెడ్‌హిల్స్, చాపల్ రోడ్, బషీర్‌బాగ్, నాంపల్లి, రవీంద్రాభారతి, లిబర్టీ, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్ల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. వేడుకలకు వచ్చేవారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక పాస్‌లను జారీ చేశారు. వేడుకలకు హాజరయ్యే వారు పోలీసులు సూచించిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను నిలుపాలని సీపీ కోరారు. సాధారణ వాహనదారులు ప్రత్యేక మార్గాల్లో వెళ్లాలనీ, నగర వాసులు పోలీసులకు సహకారం అందించాలని కోరారు.