Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు పూర్వ గవర్నర్ పీఎస్. రామ్మోహన రావు
నవతెలంగాణ-కల్చరల్
40 ఏండ్లకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ కాంగ్రెస్ పార్టీ సమాఖ్య స్ఫూర్తి కాలరాస్తున్న సందర్భంలో రాష్ట్ర హక్కుల కోసం ప్రాంతీయ పార్టీ తెలుగు దేశం స్థాపకుడు నందమూరి తారకరామారావు వారి ఆధిపత్యాన్ని ప్రశ్నించి ధిక్కరించారని తమిళనాడు పూర్వ గవర్నర్ పీఎస్. రామ్మోహన రావు అన్నారు.. రాష్ట్ర అధికారుల కోసం పోరాడిన తొలి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ నిలిచిపోతారని, నేడు కేంద్ర పెత్తనాన్ని ఎదిరిస్తున్న వారికి ఆయనే మార్గదర్శి అని కొనియాడారు. రవీంద్ర భారతి ప్రధాన వేదికపై ప్రముఖ సాంస్కతిక సేవా సంస్థ రసమయి నిర్వహణలో డాక్టర్ ఎమ్.కె.రాము రచించిన మహానటులు ఎన్టీఆర్ గ్రంథావిష్కరణ సభ వైభవంగా జరిగింది. ఎన్టీఆర్ తన నాయకత్వంలో ఎందరో మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి నాయకులుగా దేశానికి అందించారని వారే ఇప్పటికీ కొనసాగుతున్నారని చెప్పారు. సినిమాలలో ఆవేశం రౌద్ర పాత్రలను ధరించిన ఆయన నిజజీవితంలో సౌమ్యంగా ప్రశాంతంగా ఇతరులకు మర్యాదనిచ్చే మహానీయులని వివరించారు. తెలుగు వారికి ఇప్పటి వరకు ఎవరికి భారత రత్న రాలేదని ఎన్టీఆర్, పీవీ నరసింహ రావు అందుకు అర్హులని చెప్పారు. రాము రచించిన గ్రంథంలో ఎన్టీఆర్ గురించిన పలు విశేషాలు ఆసక్తి కలుగిస్తాయని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ వేణుగోపాలాచారి, తెలుగు దేశం నాయకులు నన్నపనేని రాజకుమారి, శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, దర్శకుడు నాగబాల సురేషకుమార్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్, నర్సింహప్ప, ప్రముఖ వ్యాఖ్యాత ఆశా లత, రేణుక, ప్రభాకర్ పాల్గొన్నారు.