Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
సీఐటీయూ 52వ ఆవిర్భావ వేడుకలు ఆ సంఘం కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో షాపూర్‌నగర్ రైతు బజార్ వద్ద ఘనంగా నిర్వహించారు. మండల నాయకులు కె.బీరప్ప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్లస్టర్ ప్రధాన కార్యదర్శి వి. ఈశ్వర్ రావు జెండాను ఆవిష్కరించారు. జీడిమెట్ల, గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంత అధ్యక్షులు కీలుకానీ లక్ష్మణ్ పాల్గొని మాట్లాడుతూ.. 1970లో మే 30న 'ఐక్యత పోరాటం' నినాదంతో సీఐటీయూ ఆవిర్భవించిందన్నారు. నాటి నుంచి నేటి వరకు కార్మికవర్గ సమస్యలపై ప్రయివేటీకరణ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ. 24,000 అమలు చేయాలని, కార్మిక చట్టాల సవరణ బిల్లును, లేబర్ కోడ్లను రద్దు చేయాలని పోరాడిందన్నారు. కార్మికుల హక్కులకోసం, సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడంతోపాటు దేశంలో, రాష్ట్రంలో కార్మికవర్గ ఐక్యతకు కృషి చేస్తోందన్నారు. ఆటో కార్మికుల నుంచి ఐటీ కార్మికులు, ఉద్యోగుల వరకు అందరి సమస్యలపై సీఐటీయూ స్పందిస్తోందన్నారు. రానున్న కాలంలో కార్మికవర్గ ప్రయోజనాల కోసం సీఐటీయూ చేసే పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కృష్ణ, నాగేశ్వరరావు, సునీల్, కరుణాకర్, మల్లారెడ్డి , దుర్గా నాయక్, భాషా, తిమ్మప్ప, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.