Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. అంతకుముందు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ డీఎస్ లోకేశ్ కుమార్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. 14 ఏండ్ల పాటు సాగిన ఉద్యమ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భాం అన్నారు. ఎంతో మంది ఉద్యమకారుల పోరాటం, అమరవీరుల త్యాగ ఫలంతో జూన్ 2, 2014లో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఉద్యమం సందర్భంగా ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడంవల్ల తెలంగాణ రాష్ట్రంలో అభివద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తూ వినూత్న పథకాల అమలులో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపారన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లో ఎన్నడూ లేనివిధంగా ప్రజల భాగస్వామ్యం, సహకారంతో అభివద్ధి పనులను చేపట్టి అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్న నేపథ్యంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలకు మంత్రి కేటీఆర్ సారథ్యంలో కృషి చేస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9013 కిలోమీటర్ల పొడవు రోడ్డును నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా గతేడాదిలో 3760 కిలోమీటర్ల రోడ్డు పనులను రూ. 946.46 కోట్ల వ్యయంతో చేపట్టామని చెప్పారు. ఎస్ఆర్డీపీ ద్వారా రూ. 6253.62 కోట్ల వ్యయంతో 168 వివిధ రకాల మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టగా అందులో రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, ఆర్ఓబీలు రూ.5660.57 కోట్ల అంచనా వ్యయంతో 41 పనులు చేపట్టారని అన్నారు. అందులో రూ. 2631.43 కోట్ల వ్యయంతో 29 పనులు అందుబాటులోకి వచ్చాయని, రెండో దశలో రూ.3115 కోట్ల అంచనా వ్యయంతో 12 పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలిపారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రోగ్రామ్ ద్వారా జీహెచ్ఎంసీ, చుట్టుప్రక్కల ఉన్న మున్సిపాలిటీలలో వరద ముంపు నివారణ కోసం రూ.985.45 కోట్ల వ్యయంతో 60 పనులు మంజూరయ్యాయని, అందులో జీహెచ్ఎంసీ పరిధిలో రూ.735 కోట్ల అంచనా వ్యయంతో 37 పనులు చేపట్టగా అట్టి పనులు వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయని వివరించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను ఏర్పాటు చేశామని, 6 సంవత్సరాల వయస్సు నుంచి 16 సంవత్సరాల వయస్సు గలవారికి 44 ఈవెంట్లతో 37 రోజుల పాటు 854 క్రీడా మైదానాలలో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత, కమిషనర్ డీఎస్ లోకేష్‌కుమార్, అడిషనల్ కమిషనర్ శృతిఓజా, సంతోష్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి, ఈఎన్సీ జియావుద్దీన్, హౌసింగ్ ఓఎస్డీ సురేష్‌కుమార్, సీసీపీ దేవేందర్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్లు వి.కృష్ణ, జయరాజ్ కెనడీ, సరోజ, విజయలక్ష్మి, ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, సీపీఆర్ఓ మహమ్మద్ ముర్తుజా, చీఫ్ ఫైనాన్స్ అడ్వైజర్ విజరుకుమార్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వరరెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ బాషా, సెక్రటరీ లక్ష్మి, జాయింట్ కమిషనర్లు కులకర్ణి, సంధ్య, తిప్పర్తి యాదగిరి, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ మమత, ఆయా విభాగాల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల పాత్ర మరువలేం
- మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షులు తిప్పర్తి యాదయ్య
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, కార్మికుల పాత్ర మరువలేనిదని, రాష్ట్ర సాధనలో వారు కీలకంగా వ్యవహరించారని మున్సిపల్ ఉద్యోగ, కార్మిక సంఘం అధ్యక్షులు తిప్పర్తి యాదయ్య అన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరులకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపంవద్ద నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం అధ్యక్షులు డా.తిప్పర్తి యాదయ్య మాట్లాడుతూ.. ఉద్యమంలో సబ్బండవర్గాలు పోరాడినప్పటికినీ ఉద్యోగుల పోరాటం కీలకమైనదన్నారు. అన్ని వర్గాల కలయికతో నీళ్లు, నిధులు, నియమాకాలు సాధించాలన్న డిమాండ్‌తో ఉద్యమం కొనసాగిందని గుర్తు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పి.జగన్మోహన్ మాట్లాడుతూ.. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో మున్సిపల్ ఉద్యోగులు కీలకపాత్ర నిర్వహించారన్నారు. అసోసియేట్ అధ్యక్షులు మాట్లాడుతూ వి.అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలో మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన పోరాటం మరువలేనిదన్నారు. ప్రధాన కార్యదర్శి సీహెచ్ కృష్ణ అమర వీరులను గుర్తుచేస్తూ పేరు పేరున వారికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవీందర్, మురళి పాల్గొన్నారు.