Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- అట్టహాసంగా పి ఇంద్రారెడ్డి మెమోరియల్ కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహా ప్రముఖుల హాజరు
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లేగ్రౌండ్‌లో పి.ఇంద్రారెడ్డి మెమోరియల్ 69వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్ షిప్ (మెన్ అండ్ విమెన్) పోటీలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ వీటిని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అధ్యక్షత వహించగా ఈ సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. క్రీడలకు, క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్రం నిలయంగా మారిందన్నారు. క్రీడల్లో పాల్గొని విజయం సాధించాలని, అదే సందర్భంలో ప్రతి ఓటమీ గెలుపునకు నాంది కావాలని తెలిపారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పెద్ద ఎత్తున క్రీడా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను అభినందించారు. రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి ఆటల్లో స్థానం పొందాని క్రీడాకారులను ఉద్దేశించి అన్నారు. ఇటీవల జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సాహకాలు అందిస్తున్నారని గుర్తు చేశారు. విజేతలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలని సూచించారు.
క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రకాల సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. బాక్సింగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ రూ. 2 కోట్ల నగదు ప్రోత్సాహంతో పాటు, బంజారాహిల్స్‌లో ఇంటి స్థలంతో పాటు డీఎస్పీగా ఉద్యోగం కల్పించడం గొప్ప విషయం అన్నారు. రానున్న ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు రెండు శాతం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇంద్రన్న ట్రస్ట్ చైర్మెన్ పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అంటేనే కీ.శే. ఇంద్రన్న పరితపించేవారని, ఆవిర్భావ దినోత్సవం రోజున వారిపేరు మీద రాష్ట్రస్థాయి టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కాసాని జ్ఞానేశ్వర్, మీర్పేట్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్లు ఇబ్రహం శేఖర్, తీగల విక్రమ్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి, కామేష్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు, క్రీడాకారులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.