Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు
- మామూళ్లకోసం అక్రమ నిర్మాణదారులతో కుమ్మక్కు!
నవతెలంగాణ- బేగంపేట్
సికింద్రాబాద్ జోన్ బేగంపేట సర్కిల్ పరిధిలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ముఖ్యంగా మోండా డివిజన్ పరిధిలో మున్సిపల్ అనుమతి లేకుండా భారీ అక్రమ భవంతుల నిర్మాణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పెరుమాళ్ టెంపుల్ సమీపం లో.. అక్రమంగా భారీ భవంతిని నిర్మిస్తున్నారు. మోండా డివిజన్లో అమాత్యుల అండదండలతో అక్రమ నిర్మాణాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా జోరందుకుంటున్నాయి. బేగంపేట డివిజన్ ప్రకాష్ నగర్ వాటర్ ట్యాంక్ వెనుక భాగాన భారీ నిర్మాణం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విరమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్లకోసం వారుపట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొందరు బిల్డర్లు, నిర్మాణ దారులు ఏసీపీ, సెక్షన్ ఆఫీసర్లు నోటీసులిచ్చినా అక్రమ నిర్మాణాలను ఆపడం లేదు. కొరడా ఝులిపించాల్సిన అధికారులు వారికి వచ్చే మామూళ్లకోసం ఆరాట పడుతున్నారు. కళ్లముందే అనుమతులు లేకుండా బహుళ అంతస్థులు వెలుస్తున్నా తమకేమీ పట్టనట్టుగా బేగంపేట టౌన్‌ప్లానింగ్ సిబ్బంది, అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఇరుగుపొరుగు వారు అధికారులకు ఫిర్యాదు చేస్తే ముందుగానే ఆయా భవన నిర్మాణ యజమానులతో కుమ్ముక్కయిన సిబ్బంది ఏవిధంగా నిబంధనలు అతిక్రమించాలో భవన యజమానులకు నేర్పుతున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.