Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెల్లార్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ నిబంధనలు
- నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులంటూ హెచ్చరిక
- రక్షణ చర్యలపై బిల్డర్లు, డవలపర్స్కు నోటీసులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
వర్షాకాలం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అప్రమత్తమైంది. వర్షాకాలం సందర్భంగా అన్ని సర్కిళ్లల్లో టౌన్‌ప్లానింగ్ అధికారులు, బిల్డర్లు, అర్కిటెక్చర్లు, డెవలపర్స్, స్ట్రక్చరల్ ఇంజినీర్స్, కాంట్రాక్టర్లు, సైట్ ఇంజినీర్లు, సూపర్వైజర్లు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన నిబంధనలను జీహెచ్ఎంసీ రూపొందించింది. గతంలో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో ఈసారి సెల్లార్ల తవ్వకాలు, భవన నిర్మాణాలు, ఇతర పనుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండ చర్యలు తీసుకోవాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా క్రిమికల్ కేసులు తప్పవని జీహెచ్ఎంసీ హెచ్చరిం చింది. దీనికి నిబంధనలను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ శుక్రవారం విడుదల చేశారు.
భవనాలకు సంబంధించిన సెల్లార్ల తవ్వకాలు, ఫ్రేమ్ వర్క్, తాత్కాలిక నిర్మాణాలు చేపట్టేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కూలిపోవడానికి అవకాశముంది. దీంతోపాటు కాంక్రీట్ మిక్సింగ్‌లో నాణ్యత లేకపోవడం, సరైన పరికరాలు వాడకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశముందని, వీటిపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. దీంతోపాటు బీమ్స్, బ్రాకెట్స్, పోల్స్, ఫ్రేమ్, స్లాబ్స్ వేసే క్రమంలో ఎలాంటి ఘటనలు జరగకుండ చర్యలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. కాంక్రీట్ పనులు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు కాంక్రీట్ పనుల్లో శిక్షణ పొందిన ఉద్యోగులను నియమించుకోవాలని జీహెచ్ఎంసీ సూచిస్తోంది. కాంక్రీట్ పనుల్లో నాణ్యతను పాటించాలని, మెటిరియల్, పటిష్టత, పొజిషన్, డైమెన్షన్లోనూ నిబంధనలు పాటించాలని సూచించారు. దీంతోపాటు నిర్మాణాల్లోనూ, కార్మికులకు సేఫ్టీ మెజర్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు.
సెల్లార్ల తవ్వకాల్లో...
సెల్లార్ల తవ్వకాల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీచేసింది. సైట్లో స్లోప్ స్టెబులిటీ ఉండేవిధంగా చూసుకోవాలని, సైట్‌కు అన్ని వైపుల రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. సెల్లార్లలో డంప్ చేయకూడదని, భారీ వాహనాలను అనుమతించకూడదని తెలిపారు. సెల్లార్ల తవ్వకాలకు చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని సూచించారు. డ్రెయినేజీని గుంతల్లోకి వెళ్లకుండ చూసుకోవాలన్నారు.
రక్షణ చర్యలపై బిల్డర్లు, డెవలపర్స్‌కు నోటీసులు
వర్షాకాలం నేపథ్యంలో సెల్లార్ల తవ్వకాలు, ఇతర నిర్మాణ పనుల్లో రక్షణ చర్యలు తీసుకోవాలని బిల్డర్లు, డెవలపర్స్, ఓనర్స్కు నోటీసులు జారీచేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 30 సర్కిళ్ల పరిధిలో పనులు జరుగుతున్న సైట్లను తనిఖీ చేయాలని డిప్యూటీ సిటీ ప్లానర్స్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లను కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే సెల్లార్ గుంత తవ్వినా, తవ్వడం ప్రారంభించినా బిల్డర్‌కు నోటీసు జారీచేయాలని అధికారులకు సూచించారు. నోటీసులకు స్పందించకుంటే సంబంధిత బిల్డర్ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని, సైట్ అనుమతిని కూడ రద్దు చేయాలని పేర్కొన్నారు. అనుమతిలేకుండ సెల్లార్ తవ్వి, పనులు జరగకుంటే సేఫ్టీ మెజర్స్ చెక్ చేయడంతోపాటు సీ అండ్ వేస్ట్‌తో సెల్లార్‌ను పూడ్చాలని సూచించారు. దీంతోపాటు లేబర్ క్యాంపుల్లో రక్షణ చర్యలు తీసుకున్నారా? లేదా? విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.