Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిందాబాద్ ఆధర్యంలో ఆదివారం 'సేవ్ హుస్సేన్ సాగర్ - సేవ్ హైదరాబాద్' అనే నినాదంతో ట్యాంక్‌బండ్‌పై మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ పర్యావరణవేత్త, రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ కె.బాబురావు మాట్లడుతూ పర్యావరణానికి ప్రమాదం ముంచుకొస్తున్నదనీ, ప్రజలంతా మేల్కొని యుద్ధ ప్రాతిపదిక నివారణా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భూతాపం పెరిగిపోతున్నదనీ, అడవులు అంతరించి పోతున్నాయనీ, కాలుష్యం పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. భారీగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. నిత్య జీవితంలో వ్యక్తులు వెలువరించే కాలుష్యం కన్నా పరిశ్రమల కాలుష్యం అత్యంత భారీగా ఉన్నదనీ, దాన్ని నిరోధించాలనిన్నారు. ప్రపంచంలో 10 శాతం జనాభా ఉన్న సంపన్న దేశాలు వెలువరించే కాలుష్యం ప్రపంచ కాలుష్యంలో 50 శాతంగా ఉన్నదనీ, 50 శాతం జనాభాగా ఉన్న వెనుకబడిన దేశాలు వెలువరించే కాలుష్యం 10 శాతం మాత్రమే అని తెలిపారు. భారీగా కాలుష్య నివారణా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత సంపన్న దేశాలపై ఉన్నదన్నారు. అందుకు వారు భారీగా నిధులు కేటాయించి ఖర్చు చేయాలన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న భూతాపం వల్ల భూమిపై వేడి పెరిగి, భూమిపై నివసించలేని పరిస్థితులు ఏర్పడ్డాయనీ, అందుకే '' ఓన్లీ వన్ ఎర్త్ ''అనే పిలుపు ఇచ్చామని తెలిపారు. ఈ భూగోళాన్ని కాపాడుకోవడం కోసం అన్ని ప్రభుత్వాలు నివారణా చర్యలు చేపట్టాలని అన్నారు. గతంలో మంచినీటి కొలనుగా ఉన్న హుస్సేన్ సాగర్ ప్రస్తుతం కాలుష్య జలాలతో మురికి కూపంగా తయారైందనీ, దీన్ని శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. డాక్టర్ జయసూర్య మాట్లడుతూ ప్రపంచ మానవాళిపై కాలుష్యం పంజా విసురుతున్నదనీ, ఇటీవల వచ్చిన రిపోర్టుల ప్రకారం ప్రపంచంలో 99 శాతం ప్రజలు కలుషిత గాలి పీలుస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో ఏడాదికి 90 లక్షల మంది వాయు కాలుష్యంతో చనిపోతున్నారనీ, దానిలో మన దేశంలోనే 17 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రముఖ మిమిక్రీ కళాకారులు మల్లం రమేష్ మాట్లడుతూ గాలి, నీరు పూర్తిగా కాలుష్యమై కోట్లాది మంది ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడటానికి కొన్ని విధానాలను మార్చుకోవాలనీ, భారీ కాలుష్యం వెదజల్లే కంపెనీలపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి వీరయ్య అధ్యక్షతన వహించగా, ఎం.శ్రీనివాస్‌రావు, నాగేశ్వర్రావు, పి.శ్రీనివాసరావు, మాధవి, మోహన్, రాజమౌళి, నర్సింగ్‌రావు, సుకుమార్, సైదులు పాల్గొన్నారు.