Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 ఏండ్లలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
మూడుచింతపల్లిలో ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
సీఎం కేసీవఆర్ కృషి వల్లే గ్రామాలు ప్రగతిపథంలో పయనిస్తున్నాయనీ, మంచి సంకల్పంతో గ్రామాలను బాగు చేసి వాటి రూపురేఖలు మార్చారని రాష్ట్ర పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో రూ.1.30 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడే మంత్రులి ద్దరూ కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. స్టేడియం, సీసీ రోడ్లు, షాపింగ్ కాంప్లెక్స్, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, అండర్‌గ్రౌండ్ డ్రయినేజీ తదితర పనులను జెడ్పీ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ శరత్, జిల్లా కలెక్టర్ హరీశ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడు తూ ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో దేశంలోనే ఎక్కడా లేని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో గత, ప్రస్తుత అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు, 24 గంటల ఉచిత కరెంట్, కళ్యాణలక్ష్మీ, షాదీము బారక్, కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నారని తెలిపారు. మహిళా అభ్యున్నతే లక్ష్యంగా వారికి స్వయంగా సహాయక సంఘాల ద్వారా రుణాలు అందచేయడంతోపాటు రాజకీయాల్లో కూడా సముచిత స్థానం కల్పించిన ఘనత కేవలం టీఆర్ ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.230 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అన్నారు. సీఎం మూడుచింతలపల్లిని దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రస్తుతం గ్రామంలో 70 పెండింగ్ పెన్షన్లు ఉండగా మరో 200 మంజూరు చేస్తున్నామని తెలిపారు. గ్రామంలో మహిళల కోసం ప్రత్యేకంగా రూ.5 కోట్లు రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో డీఆర్డీఏ, దళితబంధు పథకం ఎలా జరుగుతు న్నాయని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదో విడత పల్లె ప్రగతిని చేపట్టి గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తు న్నామన్నారు. కరోనా వంటి సమయలో కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా అందరికీ పింఛన్లు అందచేశా మన్నారు. కేసీఆర్ కిట్ పేదింటి వారికి ఎంతో ఆసరాగా నిలిచిందనీ, దీని వల్ల సర్కార్ హాస్పిటల్స్‌లో డెలివరీలు పెరిగినట్టు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు, గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాలు, దళితబంధు వంటి ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టామన్నారు.
పల్లెప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి
పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో ఎన్నో రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి కీసరలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని క్రీడా మైదానంలో ఖోఖో, కబడ్డీ ఆడారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లా డుతూ మేడ్చల్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందు కు మంత్రి మల్లారెడ్డి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. సీఎం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు. త్వరలోనే 57 ఏండ్ల నిండిన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తామనీ, సొంతంగా పరిశ్ర మలు, కుటీర పరిశ్రమలను పెట్టునే మహిళలకు రూ.3 లక్షలు ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికి కొత్తవారికి పెన్షన్లను త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అధికార యంత్రాంగం పనితీరు ఎంతో బాగుందనీ, అందుకే అన్ని రంగాల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ముందు స్థానంలో నిలుపు తున్నట్టు పేర్కొన్నారు. జెడ్పీ చైర్మెన్ శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు మారి అందంగా కనిపించేలా అవసరమైన చర్యలు తీసు కుంటామన్నారు. కీసర మండలానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంజూరైన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి 43 చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. జిల్లాను రాష్ట్రంలో నే మొదటి స్థానంలో నిలపడంతోపాటు ఈ సారి ఐదు గ్రామపంచాయతీలకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చేలా కృషి చేస్తామని శరత్ చంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ శరత్, జిల్లా కలెక్టర్ హరీశ్, జిల్లా అదనపు కలెక్టర్ జాం సన్, జెడ్పీ వైస్ చైర్మెన్ వెంక టేశ్, కీసర సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్, జిల్లా పంచాయతీ అధికారి, స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ మల్లారపు ఇందిర, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.