Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో మూడు రోజుల్లో బడులు పునర్ ప్రారంభం
- 9 లక్షల పుస్తకాలకు.. జిల్లాకు చేరినవి 60వేలే..!
- అధికారుల అలసత్వం.. విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ప్రయివేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని మనబడి-మనబస్తీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని స్కూళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటుంది. అలాగే ఈ విద్యాసంవత్సరం నుంచి 1-8వ తరగతి వరకు ఆంగ్ల మాద్యమ బోధన చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే టీచర్లకు ఇంగ్లీష్ భాషపై పట్టుసాధించేందుకుగాను 9 వారాలపాటు శిక్షణ కూడా ఇప్పిస్తోంది. ప్రభుత్వ బడుల బలోపేతానికి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర సర్కారు.. మరో మూడు రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా పుస్తకాల పంపిణీపై మాత్రం సీరియస్గా దృష్టి పెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి ముందస్తుగానే అందరికీ పాఠ్య పుస్తకాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం స్కూళ్లు ఓపెన్ అయ్యేందుకు సమయం దగ్గరపడినా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమో, విద్యాశాఖ ఉన్నతాధికారులు అలసత్వమో కానీ ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడంలేదని పలువురు పేర్కొంటున్నారు.
9 లక్షలకుపైనే పుస్తకాల అవసరం..!
జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు కలిపి మొత్తం 935 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు 1.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి 5 నుంచి 11 పుస్తకాలు అందించాల్సి ఉంటుంది. దీంతో ఈ ఏడాది జిల్లాలోని ఆయా పాఠశాలలకు సుమారు 9 లక్షలకుపైనే పుస్తకాలు అవసరమని జిల్లా అధికారులు విద్యాశాఖకు నివేదించారు. ఆ మేరకు విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి జిల్లాకు దాదాపు 9లక్షల పుస్తకాలు కేటాయించినట్టు తెలుస్తోంది. కాగా, ఇందులో గతేడాది మిగిలిన పుస్తకాలతో కలిపి ఇప్పటివరకు జిల్లాకు 1.20 లక్షల వరకు పాఠ్యపుస్తకాలు చేరాయని అధికారులు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ మీడియంలో మొత్తం 187 టైటిల్స్ ఉండగా.. ఇవన్నీ విద్యార్థులకు అవసరమవుతాయి. ఇవిగాక తమిళ, మరాఠి, ఇతర భాషలకు సంబంధించి పాఠ్యపుస్తకాలు కూడా ఉంటాయి. అయితే జిల్లాకు ఇప్పటివరకు కేవలం 5-6 టైటిల్స్ మాత్రమే అంటే 10 శాతం మేర పాఠ్యపుస్తకాలు చేరినట్టు తెలిసింది. మరో 90 శాతం వరకు పుస్తకాలు చేరేందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. ప్రస్తుతం జిల్లాకు చేరిన పుస్తకాలు సైతం తెలుగు, ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినవే. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుంచి పాఠశాలలు పునర్ ప్రారంభం కానుండటంతో పుస్తకాలు ఇంత తక్కువగా వస్తే విద్యార్థులకు వాటిని ఎలా అందించాలని జిల్లా అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
క్యూఆర్ కోడ్ ఏర్పాటు..
ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాలు దారిమళ్లకుండా ఉండేందుకుగాను పకడ్బందీ చర్యలు చేపట్టింది. రెండేండ్లుగా ప్రభుత్వం పంపిణీ చేసే పుస్తకాలపై ప్రత్యేక సంఖ్యను ముద్రించడంతో పాటు క్యూ ఆర్ కోడ్ ప్రచురిస్తోంది. ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్ వివరాలు నమోదు చేసుకున్నాకే పాఠ్య పుస్తకాలు అందిస్తారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి మాత్రమే ఉచిత పాఠ్యపుస్తకాలు అందనున్నాయి.
పుస్తకాల పంపిణీ ఇలా
జిల్లా కేంద్రానికి చేరుకున్న ఉచిత పాఠ్యపుస్తకాలను గోదాముల్లో భద్రపరుస్తారు. వీటిని మండల విద్యాధికారుల ద్వారా మండల కేంద్రాల్లోని మండల రిస్సోర్స్ కేంద్రాలకు చేరవేస్తారు. అక్కడి నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లి విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. ఇదిలావుంటే ఈ విద్యాసంవత్సరం 9,10 తరగతులకు బోధన పాత పద్ధతిలోనే జరగనుంది. కానీ 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధించనున్నారు. ఇందుకుగాను 1 నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను తెలుగు, ఇంగ్లీష్, రెండు భాషల్లో ముద్రించాల్సి ఉంటుంది. ఒక పేజీలో పాఠ్యాంశానికి సంబంధించి తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లోనూ ముద్రించాల్సి ఉంది. ఇలా ముద్రణ కోసం సమయం పడుతుండటం, పేపర్ కొరతతో పాటు ఎప్పటిలాగే ముందుగా జిల్లాలకు పుస్తకాల పంపిణీ పూర్తి చేసిన తర్వాత చివర్లో హైదరాబాద్కు ఇవ్వడం వల్ల ఈ నెల చివరి కల్లా విద్యార్థులకు అందుబాటులోకి రావొచ్చునని అధికారులు చెబుతున్నారు.