Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య
నవతెలంగాణ-అడిక్మెట్
తొలగించిన 937 కస్తూర్బా పాఠశాల టీచర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ నిరుద్యోగ జాక్ చైర్మెన్ నీలా వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కష్ణ అధ్యక్షతన మహాదీక్ష చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కష్ణయ్య హాజరై మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్ధతిన నియమించిన 937 టీచర్లను హఠాత్తుగా తొలగించడం అన్యాయం అని అన్నారు. కేజీబీవీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయినిలతో సమానంగా వేతనం రెగ్యులర్గా ఇస్తామని నియామకం చేసి ఇప్పుడు 8 మాసాల వేతనం చెల్లించకుండానే మౌఖిక ఆదేశాలతో తొలగించారని వాపోయారు. విద్యాశాఖ అధికారులు తమ స్వప్రయోజనాల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. గత విద్యా సంవత్సరం నుంచి పని చేస్తున్న 937 టీచర్లను కొనసాగించాలని, వీరిని తొలగించి కొత్త వారిని నియమిస్తే సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడమే అవుతుందని తెలిపారు. దీనిపై కోర్టులలో సవాల్ చేస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లపల్లి అంజి, ప్రధాన కార్యదర్శి వేముల రామకష్ణ, ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు జి.అనంతయ్య, యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంటి ముదిరాజ్, ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు జి. కష్ణ యాదవ్, లోక్ సత్తా పార్టీ నాయకులు నాగరాజు, బీసీ విద్యార్ధి సంఘం నాయకులు మోడీ రాం దేవ్, భాస్కర్ ప్రజాపతి, తిరుమలగిరి అశోక్ తదితరులు పాల్గొన్నారు.