Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలానగర్ డివిజన్ పరిధిలో శిథిలావస్థకు చేరిన గవర్నమెంట్ స్కూల్ బిల్డింగులు
- అల్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఇబ్బందికరంగా మ్యాన్ హోల్ సమస్య
నవతెలంగాణ-బాలానగర్/నేరెడ్మెట్
ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల భారం భరించలేక పేద, మధ్య తరగతి వారు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకే మొగ్గుచూపుతున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వం కొన్ని పాఠశాలలను అస్సలు పట్టించుకోకపోవడం, అక్కడి సమస్యలు పరిష్కరించకపోవడంతో ఇబ్బందులు ఎదురవు తున్నాయి. మనబస్తీ- బనబడి కార్యక్రమాలను చేపట్టినా పలు ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తమ పిల్లల చదువులకు ఇబ్బందిగా మారుతున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. బాలా నగర్, అల్వాల్ డివిజన్ల పరిధిలోని పలు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఇక్కడి ప్రజలు కోరుతు న్నారు. స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని బాలానగర్ డివిజన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్వాల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో డ్రయినేజీ సమస్య వల్ల ఇక్కడి స్టూడెంట్స్ ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు.
చరబండరాజు నగర్లో..
కూకట్పల్లి నియోజకవర్గం, బాలానగర్ డివిజన్ పరిధిలోని చరబండరాజునగర్లోని ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాల శిథిలావస్థకు చేరింది. కొద్దిపాట వర్షానికే భవనంలోపలి పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో టీచర్లు, స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. 60 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్న ఈ పాఠశాలలో టారులెట్స్ ఉన్నప్పటికీ వాటికి డోర్లు లేక ఇబ్బందులు తప్పడం లేదు.
ఇందిరాగాంధీ పురంలో...
మూసాపేట సర్కిల్, ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఇందిరాగాంధీ పురంలోని ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరి పూర్తిగా కూలిపోవడంతో సమీపంలోని కమ్యూనిటీ హాల్లో చదువు చెప్తున్నారు. స్థానికులు ఇక్కడి నుంచి పాఠశాలను మరో చోటకు మార్చుకోవాలని టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారు. దాదాపు 75 మంది ఉన్న పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో స్టూడెంట్స్, టీచర్స్ ఇబ్బందులు పడుతున్నారు.
ఓల్డ్ అల్వాల్‌లో..
ఓల్డ్ అల్వాల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మ్యాన్‌హోల్, డ్రయినేజీ సమస్య ఇబ్బందికరంగా మారింది. మ్యాన్‌హోల్ పొంగి పొర్లుతుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో విద్యార్థులు ముక్కు మూసుకుని స్కూల్ లోపలికి వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. దుర్వాసన వల్ల మధ్యాహ్న భోజన సమయంలో తిండి కూడా సరిగ్గా తినాలనిపించడం లేదని పిల్లలు వాపోతున్నారు. స్కూల్‌కు గ్రౌండ్ లేకపోవడం, తరచూ వాహనాల రాకపోకతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం విద్యార్థులను, తల్లిదండ్రులను వెంటాడుతోంది. 'మన ఊరు- మనబడి/మన బస్తీ' కింద ఈ పాఠశాల ఎంపికైనా ఇంకా నిధులు పూర్తిగా విడు దల కాలేదు. రూ.27 లక్షలతో డెవలప్ చేయాలని నిర్ణయిం చారు. కానీ 5శాతం నిధులు హెచ్ఎం ఖాతాలో జమ అయ్యా యి. స్కూల్‌వద్ద డ్రయినేజీ సమస్యపై హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బీ మేనేజర్ మల్లికార్జున్ స్పందిస్తూ అక్కడి వెళ్లి పరిశీలించామనీ, లీకేజీ లేదనీ, అంతా క్లీన్ చేశామని తెలిపారు. భవిష్యత్‌లో ఇబ్బంది లేకుండా 400 ఎంఎం పైపులైన్‌ను జీహెచ్ఎంసీ ద్వారా వేయిస్తామన్నారు.
సొంత భవనం ఏర్పాటు చేయాలి
ప్రయివేటులో ఫీజుల భారం మోయలేక తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు మార్చేందుకు ఇష్టపడుతున్నారు. ఇందిరాగాంధీ పురంలో కొన్నేండ్ల కిందట ప్రభుత్వ పాఠశాల కూలిపోవడంతో స్థానిక జీహెచ్ఎంసీ కమిటీ హాల్లో ఓ పక్క విద్యా బోధన కొనసాగిస్తున్నారు. సొంతభవనం లేకుండా పాఠశాల నిర్వహణ విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారుతుంది. ప్రభుత్వం సొంత భవనం ఏర్పాటు చేయాలి.
- ముద్దాపురం కృష్ణగౌడ్, మాజీ కార్పొరేటర్, ఫతేనగర్
శిథిలావస్థలో చెరబండరాజు నగర్ పాఠశాల
చెరబండరాజు నగర్‌లోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. వర్షమొస్తే పై పెచ్చులు ఊడుతుంటాయి. అయినా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. మన బస్తీ-మనబడి, పట్టణ ప్రగతి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినా పాఠశాల అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలల అభివద్ధికి కృషి చేయాలి.
- ఆకుల నరేందర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, బాలానగర్ డివిజన్
స్థలం ఎంపికైతే పాఠశాల భవన నిర్మాణం
మనబస్తీ-మనబడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపిక చేసిన పాఠశాలలను మాత్రమే ఆధునీకరిస్తున్నాం. ఇందిరా గాంధీపురంలోని ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరి కూలిపో యింది. ఉన్నతాధికారులు, కార్పొరేటర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. నూతన భవన నిర్మాణం కోసం ప్రయత్నిస్తున్నారు. సరైన స్థలం ఎంపిక కోసం పరిశీలనలో ఉంది. స్థలం కేటాయిస్తే పాఠశాల భవన నిర్మాణం పూర్తవుతుంది. బాలానగర్ డివిజన్ పరిధిలోని చెరబండరాజు నగర్లో మండల పరిషత్ పాఠశాల శిథిలావస్థలో ఉన్నప్పటికీ రెండవ విడతలో చేర్చడం వల్ల మరమ్మతులు చేపట్టలేదు.
- ఆంజనేయులు, మండల విద్యాధికారి