Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ సైట్-3లోని నాట్కో ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 815 మంది విద్యార్థులు, 6 నుంచి 10వ తరగతి వరకు రెండు వేల మంది బాల బాలికలు ఉన్నారు. అయితే విద్యార్థులు ఫుల్గా ఉన్నా.. టీచర్లు మాత్రం లేరు. అంతమంది విద్యార్థులకు 40 మంది టీచర్లు మాత్రమే ఉండగా, ఇంకా 40 మంది ఉపాధ్యాయులు అవసరం ఉంది. అయితే ప్రభుత్వం నియామకాలు జరపడంలేదని ఉపాధ్యాయులు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలను అభివద్ధి పరచాలనే ఉద్దేశంతో సీపీఐ(ఎం) నాయకులు సాయి శేషగిరి రావు స్థానిక బస్తీల్లోని తల్లిదండ్రులను ఒప్పించి, సోమవారం పదిమంది విద్యార్థులను తీసుకొని వెళ్లి నాట్కో స్కూల్ ఎలిమెంటరీ హెచ్ఎం శ్రీదేవిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె సీపీఐ(ఎం) నాయకులతో మాట్లాడుతూ ప్రతిరోజూ 10 నుంచి 20 మంది బాలబాలికలు కొత్తవారు చేరుతున్నారని, దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే అని అన్నారు. అయితే విద్యార్థులకు అన్ని సదుపాయాలున్న సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. లేకపోతే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చేరిన పిల్లలు తిరిగి ప్రయివేటు పాఠశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పారు.
అనంతరం సీపీఐ(ఎం) నాయకులు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని, అయితే విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేకుంటే పాఠాలు ఎలా పూర్తి అవుతాయని, మంచి మార్కులు ఎలా సాధిస్తారని ఆవేదన వ్యక్తపరిచారు. వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకుని యుద్ధ ప్రాతిపదికన అన్ని సర్కార్ పాఠశాలలో విద్యార్థులకు తగిన రీతిలో ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులు తిరిగి ప్రయివేటు పాఠశాలలకు వెళ్తే తాము చేసిన ప్రయాస వ్యర్థం అవుతుందన్నారు. వెంటనే విద్యాశాఖ అధికారులు, సీఎం కేసీఆర్ చర్యలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో తగిన ఉపాధ్యాయ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.