Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని భారంతో మరణించిన ఆశావర్కర్ సుజాత కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలి
- ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె. జయలక్ష్మి
నవతెలంగాణ-ధూల్‌పేట్
ఆశావర్కర్లపై అధికారుల వేధింపులు ఆపాలని, పని భారంతో మరణించిన ఆశావర్కర్ సుజాత కుటుంబానికి రూ. 25 లక్షలు చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె. జయలక్ష్మి డిమాండ్ చేశారు. మలక్‌పేట శాలివాహననగర్ యూపీహెచ్‌సీలో పనిచేసే ఆశావర్కర్ సుజాత వర్క్ ఒత్తిడితో అక్కడే మృతిచెందింది. ఈ విషయం తెలుసుకున్న ఆశా వర్కర్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె. జయలక్ష్మి, సీఐటీయూ సౌత్, సెంట్రల్ జిల్లా నాయకులు ఎం శ్రావణ్ కుమార్, ఎం మీనా, ఎం వెంకటేష్ ఆశా సీఐటీయూ యూనియన్ నాయకులు సుజాత నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కె. జయలక్ష్మి మాట్లాడుతూ అధికారుల వేధింపులతో సుజాత మరణించిందని, ఈఘటనకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. సుజాత కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఆమె చిన్న పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు విధుల్లో చనిపోయిన సుజాత కుటుంబానికి న్యాయం చేయాలని, పని భారం పెంచుతూ వేధింపులకు గురి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆశ సీఐటీయూ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు చేయడం సరికాదు: సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు పి నాగేశ్వర్
చనిపోయిన సుజాత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న సీఐటీయూ నాయకులను అరెస్టు చేయడాన్ని రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు పి నాగేశ్వర్ తీవ్రంగా ఖండించారు. ఈ దుర్ఘటన పై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలని, తక్షణం వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయాలన్నారు. లేకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుస్తామని హెచ్చరించారు.