Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగర్ రింగ్‌రోడ్డు ఫ్లై ఓవర్ కింద సిగ్నల్ లేదు
- మూసారాంబాగ్‌లో అస్తవ్యస్తం
- ఉప్పల్, ఛే నెంబర్, అంబర్పేట్ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి
- యూ టర్న్లతోనూ ఇబ్బందులు
- పట్టించుకోని జీహెచ్ఎంసీ, పోలీసుశాఖ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జనాభాతోపాటు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. వాహనాల రద్దీతోపాటు ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. పలుచోట్ల సిగ్నల్స్ పని చేయకపోవడంతోపాటు యూటర్న్‌లతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశాలూ లేకపోలేదు. దీంతోపాటు ఎస్ఆర్డీపీ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. దీని పరిష్కారానికి గ్రేటర్లో కొత్త చర్యలకు సిద్ధమవుతున్నారు.
గ్రేటర్లో అడాప్టెడ్ ట్రాఫిక్ సిగల్ కంట్రోల్(ఏటీఎస్సీ) సిస్టమ్ ద్వారా, పాదచారుల ప్రమాదాల నివారణకు పెలికాన్ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ సిగల్స్ ఏర్పాటు చేయనున్నారు. పోలీస్‌శాఖ అధికారులు పోల్మార్కింగ్ లొకేషన్ గుర్తించి పోలీసు అధికారులు ప్రతిపాదన మేరకు జీహెచ్ఎంసీ సిగల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో నగరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అడాప్టెడ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ (ఏటీఎస్సీ) ద్వారా 96 సిగల్స్, పెలికాన్ సిస్టమ్ ద్వారా మరో 70 ఏర్పాటుకు ప్రతిపాదించారు. సిగల్స్ ఏర్పాటులో పోలీస్ శాఖ సూచించిన మేరకు ఫీజుబులిటిని బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ ప్రణాళిక సిద్ధం చేసింది.
50 సిగళ్లను..
జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ పద్ధతుల ద్వారా ట్రాఫిక్ 384 సిగళ్లు ఏర్పాటు చేయాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది. అందులో హెచ్‌ట్రిమ్స్ ద్వారా 234, ఏటీఎస్సీ పద్దతి ద్వారా 150 ఏర్పాటుకు ప్రతిపాదించారు. యూ టర్న్, ఫ్లైఓవర్లు, సైట్ ఫీజుబులిటీ కారణంగా 50 సిగళ్లను ఎత్తేశారు. మిగిలిన 334లలో హెచ్‌ట్రిమ్స్ 212, ఏటీఎస్సీ 122 ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, ప్రసుతం 199 హెచ్‌ట్రిమ్స్, 73ఏటీఎస్సీ ద్వారా మొత్తం 272 సిగల్స్ ఏర్పాటు అందుబాటులోకి తెచ్చారు. 44 వివిధ ప్రగతి దశలో ఉన్నాయి. మరో 18 లొకేషన్లను పోలీసుశాఖ అధికారులు నిర్ణయించాల్సి ఉంది. అసంపూర్తిగా ఉన్న సిగల్ ఏర్పాటు పూర్తయితే హెచ్‌ట్రిమ్స్ ద్వారా 212 సిగల్స్, ఏటీఎస్సీ ద్వారా 122 నగరంలో మొత్తం 334 సిగల్స్ త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
పనిచేయని సిగల్స్
గ్రేటర్లో పలు ప్రాంతాల్లో సిగల్స్ పని చేయడం లేదు. ఎస్ఆర్డీపీ ఫ్లైఓవర్ నిర్మించిన సాగర్‌రింగ్ రోడ్డులో సిగల్ ఏర్పాటు చేయకపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అంబర్పేట్, చే నెంబర్ ప్రాంతాల్లోనూ సిగల్స్ పని చేయడం లేదు. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే సాగర్ సొసైటీ, బంజారాహిల్స్ రోడ్డు నెం.1లోని సిటీ సెంటర్, బంజారాహిల్స్ రోడ్డు నెం.12, ధరంకరమ్ రోడ్డు, శ్రీనగర్‌కాలనీ, మైత్రీవనం, యూసఫ్గుడ చెక్‌పోస్ట్ సిగల్స్ పని చేయడం లేదు వీటితోపాటు ఉప్పల్ జంక్షన్, మూసారాంబాగ్ చౌరస్తాలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఎస్ఆర్డీపీ పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వీటివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు.
సురక్షిత ప్రయాణం కోసమే సిగల్స్ : జీహెచ్ఎంసీ
సురక్షిత ప్రయాణం కోసమే ట్రాఫిక్ సిగల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. సిగల్స్‌ను కేంద్రీకృతంగా నియంత్రించడం, ట్రాఫిక్ అనుగుణంగా సిగల్ టైమింగ్ మార్చుకునే వెసులుబాటు, ట్రాఫిక్‌ను కెమెరాలో రికార్డు చేసే సెన్సార్ ఏర్పాటు, పవర్ బ్యాక్ అప్ కోసం సోలార్, బ్యాటరీ ఏర్పాటు, మెరుగైన ప్రయాణం, తక్కువ సమయం వెయిటింగ్ చేయడం, సిగల్స్ వ్యవస్థతో రోడ్డు భద్రత పెరుగుదల నగర ప్రజలకు సురక్షిత ప్రయాణానికి కృషి చేస్తున్నది.