Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలు, పెండింగ్ అభివృద్ధి పనులు
- జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-బేగంపేట్
జులై 17 వ తేదీన జరిగే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, అంతకు ముందే పనులన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. గురువారం వెస్ట్ మారేడ్‌పల్లి లోని తన నివాసం వద్ద వివిధ శాఖల అధికారులతో బోనాల ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాటా నుండి రాంగోపాల్‌పేట ఓల్డ్ పోలీసు స్టేషన్ వరకు చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. మహంకాళి బోనాల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారని, ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులు వచ్చిన సందర్భంగా ఎటువంటి తోపులాటలు, ఇబ్బందులు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మవారికి బోనాలు తీసుకొచ్చే వారు ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసు, దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ మళ్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల సందర్భంగా వాటర్ పాకెట్స్, బాటిల్స్ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, ఆర్ అండ్ బి ఈఈ రవీంద్ర సాగర్, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, ఏసీపీ రమేశ్, ట్రాఫిక్ ఏసీపీ గంగారెడ్డి, వాటర్ వర్క్స్ జీఎం రమణా రెడ్డి, సీఐ కావేటి శ్రీనివాసులు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, ఆలయ ట్రస్టీ కామేష్, అభివద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.