Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ ర్యాలీ, ధర్నా స్తంభించిన పాలన
- కాంట్రాక్టు, టైమ్ స్కేల్ ఉద్యోగులను పర్మినెంట్ చేశాకే నియామకాలు చేపట్టాలి: జ్ఞానేశ్వర్
నవతెలంగాణ-ఓయూ
కాంట్రాక్టు, టైమ్ స్కేల్ ఉద్యోగులను పర్మినెంట్ చేసిన తర్వాతనే యూనివర్సిటీల్లో బోధనేతర నియమాకాలు చేపట్టాలని ఓయూ ఎన్జీఓఎస్ అధ్యక్షుడు బియాని. జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశారు. యూనివర్సిటీల నియామకాల బోర్డ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఓయూలో ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి పరిపాలనా భవన్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. వీరికి ఓయూ మూడు బోధనేతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మద్దతు ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 16 తీసుకురావడం వల్ల యూనివర్సిటీలో 20, 30 ఏండ్ల నుంచి కాంట్రాక్టు, టైమ్ స్కేల్ ఉద్యోగులు చాలీచాలని వేతనాలతో ఎలాంటి ఉద్యోగ బెనిఫిట్స్, కారుణ్య నియామకాలు లేకుండా వెట్టిచాకిరి చేస్తున్నారని, ఏదో ఒక రోజు రెగ్యులరైజ్ కదా? అంటూ ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇలాంటి సమయంలో బోర్డ్ ఏర్పాటు చేయడంతో ఉద్యోగులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారన్నారు. నాన్ టీచింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇప్పటికీ పర్మినెంట్ కాలేకపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం జీవో నెంబర్ 16 రద్దు చేసి అర్హులైన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా రాష్ట్ర ఏర్పాటు కాగానే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని నేడు పొమ్మన లేక పొగ పెట్టడం బాధాకరం అన్నారు. ఎంప్లాయాస్ యూనియన్ అధ్యక్షుడు శివ శంకర్ మాట్లాడుతూ.కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం కోసం 13 యూనివర్సిటీలో ఉద్యోగులను ఏకం చేసి ఉద్యమిస్తామని తెలియజేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు మూడు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సోమవారం సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనునట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల నేత అంజయ్య, నేతలు రవి, భూమయ్య, రాజేష్, అశోక్, నాగరాజ రావు, ఎస్. విజరు కుమార్, అక్బర్ బేగ్, కాంట్రాక్టు ఉద్యోగులు సూర్య చందర్, విరేష్, విఠల్, నారాయణ, శ్రీకాంత్, వెంకట్ ముదిరాజ్ పాల్గొన్నారు.