Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
తెలుగు నాట ఉన్న తెలుగువారు ఆంగ్ల భాషా పిచ్చిలోఉంటే విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు మాతభాషను ప్రేమిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వీ.రమణ అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై ఆస్టేలియాలోని తెలుగు సంస్థ తెలుగు మల్లి నిర్వహణలో తూములూరు శాస్త్రి రచించిన భారతీ విలాసం (కాళిదాసు చరిత్ర) నాటక గ్రంథ అవిష్కరణ సభ జరిగింది. డాక్టర్ రమణ పాల్గొని గ్రంథాన్ని అవిష్కరించి మాట్లాడారు. మల్లికేశ్వరరావు సుదూర ప్రాంతంలో ఉన్న తెలుగు భాషా ప్రేమికుడని, ఆయన కాళిదాసు చరిత్ర నాటక రూపంలో రాసి తెలుగు వారికి అందించాలనే తపనతో తెలంగాణలోని గ్రంథాలయాలకు ఉచితంగా అందించడానికి అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత వచ్చినా గ్రంథాల విలువ తగ్గదన్నారు. ఈ నాటకాన్ని రాష్ట్ర రాజధానిలో ప్రదర్శించే ఏర్పాటు చేయాలని రామరాజుకు సూచించారు. వంశీ రామ రాజు స్వాగతం పలుకుతూ గ్రంథాలు ఇంట్లో ఉంచుకొనీ కంటే రచయితలు గ్రంథాలయాలకు వితరణ చేయాలన్నారు. గ్రంథాల పరిషత్ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ మల్లీకేశ్వరరావు భారతీ విలాసం నాటక గ్రంథాలను లైబ్రరీకి వితరణ ఇచ్చి పలువురికి కాళిదాసు చరిత్ర తెలుసుకునే అవకాశం కల్పించారన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రపంచంలో గొప్ప కవుల్లో కాళిదాసు ఒకరని, ఆయనను తెలుసుకోవటం నేటి యువత బాధ్యత అన్నారు. సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు.