Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుర్కయంజాల్, తొర్రూర్‌లో ప్లాట్ల వేలానికి భారీ స్పందన
- హెచ్ఎండీఏ ఈ-వేలం ప్రక్రియకు ఆదరణ
- మొత్తం 50 ప్లాట్ వేలంలో 33 ప్లాట్లకు బిడ్స్
- అత్యధికంగా గజం ధర రూ.38,500
- అత్యల్పంగా గజం ధర రూ.20,500
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగర శివారు ప్రాంతాల్లో రియల్ భూమ్ జోరందకుంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ హైవే మార్గంలో భూములకు ధరలకు రెక్కలొచ్చాయి. అందుకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన ప్లాట్ల ఈ-వేలం ప్రక్రియనే నిదర్శనం. తుర్కఎంజాల్, తొర్రూర్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతోపాటు నిర్మాణ పనులు సైతం ఊపందుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌కు నాలుగు దిక్కుల శివారు ప్రాంతాల్లో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే కూకట్పల్లి, హైటెక్‌సిటీ, పటాన్చెరు, మేడ్చల్, ఘట్కేసర్, అల్వాల్, రాజేంద్రనగర్, శంషాబాద్ ప్రాంతాల్లో విచ్ఛలవిడిగా వెంచర్లు వెలిశాయి. అయితే నగరానికి సమీపంగా ఉండడంతో కాలుష్యం సమస్య తక్కువగా ఉన్న ప్రాంతాలకు జనం మొగ్గుచూపుతున్నారు. అందులోభాగంగానే తుర్కఎంజాల్, తొర్రూర్ ప్రాంతాల్లో ప్లాట్ల వేలానికి భారీ స్పందన వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
తుర్కయంజాల్‌లో
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ గురువారం నిర్వహించిన ఆన్లైన్ ప్లాట్ల వేలం ప్రక్రియలో కొనుగోలుదారులు అత్యంత ఆసక్తి కనబరిచారు. మొత్తం 85 ప్లాట్లకు జరిగిన ఈ-ఆక్షన్‌లో 73 ప్లాట్లు బిడ్డర్లు కోనుగోలు చేశారు. బహుదూర్‌పల్లి, తుర్కయంజాల్లలో హెచ్ఎండీఏ వెంచర్ల ముందు నుంచి అత్యంత డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. బహుదూర్‌పల్లి వెంచర్లో 51 ప్లాట్లకుగాను 50 ప్లాట్లు గురువారం వేలంలో అమ్ముడుపోయాయి. బహుదూర్‌పల్లి వెంచర్లో గజం రూ.25వేలు నిర్ణయించగా అత్యధికంగా గజం రూ.42,500ల ధర పలికింది. అత్యల్పంగా రూ.29వేలకు కొనుగోలుదారులు సొంతం చేసుకున్నారు. తుర్కయంజాల్ వెంచర్లో 34 ప్లాట్లకుగాను 23 ఫ్లాట్లకు బిడ్ దాఖలు చేసిన ఔత్సాహికులు కొనుగోలు చేశారు. ఇక్కడ గజం రూ.40వేలు ధర నిర్ణయించగా అత్యధికంగా రూ.62,500లు అత్యల్పంగా రూ.40,500ల వరకు అమ్మకాలు జరిగాయి. దీంతో ఆన్లైన్ ద్వారా రూ.137.65 కోట్ల విలువచేసే ప్లాట్ల అమ్మకాలు జరిగాయి.
తొర్రూరులో
తొర్రూరు ప్లాట్ల కొనుగోలుకు పోటాపోటీ నెలకొంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కఎంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్‌లో హైదరాబాద్ మెట్రో పాలిటన ్డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) రూపొందించిన 'తొర్రూర్ లేఅవుట్'లో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. రెండో దఫా 140 ప్లాట్లను వరుసగా మూడు రోజుల పాటు ఆన్లైన్ వేలం ద్వారా హెచ్ఎండీఏ విక్రయించనుంది. శుక్రవారం రెండు సెషన్లలో 42 ప్లాట్లకు జరిగిన ఆన్లైన్ వేలంలో 41 ప్లాట్లకు కొనుగోలుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. ఉదయం జరిగిన సెషన్లో అత్యధికంగా గజం రూ.33వేలు ధర పలుకగా, అత్యల్పంగా గజం రూ.23వేలు పలికింది. సాయంత్రం సెషన్లో అత్యధికంగా గజం రూ.35,500లు బిడ్ చేయగా, అత్యల్పంగా గజం రూ.21,000లకు ధర పలికింది. శుక్రవారం రూ.33.58 కోట్ల విలువజేసే 41 ప్లాట్లు ఆన్లైన్ వేలం ద్వారా అమ్మకాలు జరిగాయి.
రెండో రోజూ అదే జోరు
తొర్రూరు హెచ్ఎండిఏ లే అవుట్ కు సంబంధించి శనివారం 50 ప్లాట్లకు ఆన్ లైన్ ద్వారా వేలం ప్రక్రియ జరిగింది.హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి నిర్వహించిన ఆన్ లైన్ వేలం(ఈ-ఆక్షన్)లో ప్లాట్లు మార్నింగ్ సెషన్ లో 25 ప్లాట్లు ఈవినింగ్ సెషన్ లో 25 ప్లాట్ల చొప్పున వేలం ప్రక్రియను నిర్వహించారు.మార్నింగ్ సెషన్ లో 25 ప్లాట్ లకు గాను 23 ప్లాట్లుకు బిడ్డింగ్ జరిగింది. అత్యధికంగా గజం రూ.38,500ల ధర పలుకగా, అత్యల్పంగా గజం రూ .20, 500లు బిడ్డర్లు కోట్ చేశారు. ఈవినింగ్ సెషన్ లో 25 ప్లాట్ లకు గాను 10 ప్లాట్లుకు బిడ్డింగ్ జరిగింది. అత్యధికంగా గజం రూ.28,000ల ధర పలుకగా, అత్యల్పంగా గజం రూ .20, 500లకు బిడ్డర్లు కోట్ చేశారు. శనివారం జరిగిన వేలం ద్వారా రూ.23.56 కోట్ల విలువచేసే 33 ప్లాట్ల అమ్మకాలు జరిగాయి. సోమవారం చివరి రోజున మిగిలిన ప్లాట్లకు ఆన్లైన్ వేలం జరుగుతుంది.