Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బహిరంగ సభ
- సికింద్రాబాద్ పరిసరాల్లో భద్రత మరింత కట్టుదిట్టం
నవతెలంగాణ-సిటీబ్యూరో
దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు హైదరాబాద్ నగరం వేదికైంది. ఓ వైపు ఆషాడమాస బోనాలు, మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోడీ రాక, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా సైతం నగరంలో పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 10 వేల మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. బీజేపీ కేంద్ర కార్యవర్గ సమావేశాలు నగరంలో జరుగుతుండటంతో పోలీసులతోపాటు కేంద్ర హోంశాఖ కూడా ఇక్కడ భద్రతపై దృష్టిసారించారు. వీవీఐపీలకు ఎటువంటి అవరోధాలు ఎదురుకాకుండా అన్ని ముందుజాగ్రత్త చర్యల తీసుకున్నారు. మూడు కమిషనరేేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సివిల్, ట్రాఫిక్, ఎస్వోటీ, టాస్క్ఫోర్సుతోపాటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్, స్పెషల్ఫోర్సు పహారా కాస్తున్నాయి. ప్రత్యేకంగా సికింద్రాబాద్ ప్రాంతాలల్లో హైదరాబాద్ సిటీ ఆర్మ్ రిజర్వ్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మఫ్టీ క్రైమ్ పార్టీ తెలంగాణ పోలీస్ బెటాలియన్ బలగాలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద భారీ భద్రత
నగరంలోని పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. నేడు ఆదివారం యూపీ సీఎం యోగితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా చార్మినార్ వద్ద పోలీసులు మోహరించారు. ఇదిలావుండగా శనివారం చార్మినార్‌వద్ద టీఆర్ఎస్ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాట్లు చేశారు.
హెచ్ఐసీసీ వద్ద ఉద్రిక్తత
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ 2న చేరుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సైతం బేగంపేట్‌కు చేరుకున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. శనివారం బేగంపేట్, హెచ్ఐసీసీతోపాటు పలు ప్రాంతాలల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యూత్ కాంగ్రెస్ నేతలు హెచ్ఐసీసీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం నగరం లోని ఆయా ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.
పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలల్లో ట్రాఫిక్ మళ్లింపులను విధించారు. బహిరంగ సభకు వివిధ జిల్లాలు, ప్రాంతాల నుంచి వాహనాలపై బీజేపీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, వీవీఐపీలు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లను చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు
మాదాపూర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రాజ్‌భవన్, పంజా గుట్ట, బేగంపేట్ ఎయిర్పోర్ట్, పరేడ్‌గ్రౌండ్, పరిసర ప్రాంతాలల్లో ట్రాఫిక్‌ను నిషేధించారు. ఆయా ప్రాంతాలల్లో వెళ్లే సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. తివోలి ఎక్స్ రోడ్ నుండి ప్లాజా ఎక్స్ రోడ్ మధ్య రహదారి మూసివేశారు.
చిలకలగూడ, అలుగడ్డబాయి, సంగీత్, ప్యాట్నీ, స్వీకార్ ఉప్కార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమలగిరి. తాడ్‌బండ్ ఎక్స్ రోడ్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయినపల్లి, రసూల్‌పురా, బేగంపేట్, ప్యారడైజ్ తదితర ప్రాంతాలల్లో ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
సిటీ సెంటర్ (అమీర్‌పేట్) వైపు వెళ్లాలనుకుంటే
మేడ్చల్, కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ ఫ్లైఓవర్, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాలి.
ఉప్పల్ నుంచి వెళ్లాలనుకుంటే
ఉప్పల్ నుండి రామంతపూర్, అంబర్పేట్, హిమాయత్ నగర్, వివి విగ్రహం, పంజాగుట్ట రహదారిలో వెళ్లాల్సి వుంటుంది.
ఉప్పల్, తార్నాక, రైలు నిలయం మార్గంలో రద్దీగా ఉండే రహదారిని ఉపయోగించవద్దు.
రైల్వే ప్రయాణికుల కోసం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సాయంత్రం రైళ్లలో ప్రయాణించాలనుకునే సాధారణ ప్రయాణీకులు సకాలంలో రైల్వే స్టేషన్ చేరుకోవడానికి ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు. ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వైపు నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకునేటప్పుడు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది కావున ప్రజలు చిలకలగూడ వైపు నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కుప్లాట్ఫారమ్ నెం.10 నుండిచేరుకోగలరు.
బహిరంగ సభ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌కి 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని రోడ్లు/జంక్షన్‌ల్లో ట్రాఫిక్ కిక్కిరిపోనుంది. ప్రయాణికులు, సాధారణ వాహనదారులు ప్రతామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.