Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.ఐదు లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్న స్థానిక నాయకులు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
చంద్రమ్మ(45) అనే మహిళకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్నగర్ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ బస్తీలో 50 గజాల స్థలం ఉంది. కండ్లు లేకపోవడంతో బిక్షాటన చేసుకుంటూ తన 13 ఏండ్ల కుమార్తె, అనారోగ్యంతో ఉన్న భర్తతో కలిసి జీవిస్తుంది. కాగా స్థానిక నాయకుల మాటలు నమ్మి ఖైరతాబాద్ రెవెన్యూ కిందిస్థాయి అధికారులు అన్యాయంగా ఆమె ఇంటిని కూల్చివేశారు. బుధవారం తన ఇంటి వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి, గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాను, కరెంటు బిల్లును చూపించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం 1993లో అప్పటి ప్రభుత్వం వికలాంగురాలు అయిన తనకు పట్టా నంబర్ ఎఫ్/4477/93 తేదీ 1-11-1993న ప్లాట్ నంబరు 89పై నివాసం ఉండుటకు 50 గజాల స్థలాన్ని కేటాయించిందని తెలిపింది. అప్పటినుంచి కొంతకాలం గుడిసె వేసుకొని, ఆ తర్వాత భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బుతో రేకుల గది నిర్మించుకొని అనారోగ్యంతో ఉన్న భర్త, 13 సంవత్సరాల వయస్సు గల కుమార్తెతో అదే ఇంటిలో నివసిస్తున్నామని చెప్పింది. అయితే గతేడాది నుంచి స్థానిక నాయకులు అంధురాలు అయిన ఆమెను బెదిరిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన పట్టాలు చెల్లవని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పట్టా లేకుంటే ఈ స్థలంలో ఉండుటకు వీలులేదని, తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, స్థానిక నాయకులమైన తమకు ఐదు లక్షలు ఇస్తే ఇల్లు నిర్మించుకొనుటకు అన్ని అనుమతులు ఇప్పిస్తామని, లేని ఎడల కూల్చివేయిస్తామని బెదిరించారు. ఖైరతాబాద్ రెవెన్యూ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆమె నివసిస్తున్న ఇంటిని ఇటీవల కూల్చివేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా కలెక్టర్కు, ఆర్డీఓ, ఎంఆర్ఓకు వినతిపత్రాలు ఇవ్వగా, పై అధికారులు వచ్చి పరిశీలించి తిరిగి రేకుల గది నిర్మించుకొనుటకు తమకు అనుమతి ఇచ్చారని పేర్కొంది. పై అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ, స్థానిక నాయకులు తమకు ఐదు లక్షలు ఇవ్వాలని, లేనియెడల అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. తనను బెదిరించే వారిపై చర్యలు తీసుకొని, తెలంగాణ ప్రభుత్వం తనకు కొత్త పట్టా మంజూరు చేసి, 58 జీవో కింద ఇల్లు నిర్మించుటకు అనుమతి ఇవ్వాలని వేడుకుంది.