Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ధరణితో అన్నీ చిక్కులే అనీ, ఇబ్బందులు తప్పడం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి క్రిష్ణతేజ అన్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రవేశ పెట్టిన ధరణి ఆరంభంలో అదుర్స్ అనిపించినా ఆచరణలో మాత్రం బేవర్స్గా తయారైందన్నారు. ఇప్పటికీ ధరణి పోర్టల్లో ఇబ్బం దులు ఎదరవుతున్నాయని తెలిపారు. ఆదాయం పెంచుకోవడంపైన ఉన్నంత శ్రద్ద వీటిపై లేకుండా పోయిందన్నారు. వారసులకు ఇబ్బందులు, పాస్ బుక్కుల జారీలో జాప్యం కొనసాగుతూనే ఉందన్నారు. ప్రతీ క్షణం ఐటీ జపం చేస్తున్న సర్కార్ ఎందుకు ధరణిని సక్రమంగా నిర్వహించలేకపోతోంది అని ప్రశ్నించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్లాట్లు, పొలాలు రిజిస్ట్రేషన్ల కోసం ఇంకా వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈరోజు వరకు గ్రామాల్లో సరిహద్దులు ఏర్పాటు చేయలేదంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అన్నారు. రెవెన్యూ వ్యవస్థ అవినీతికి అడ్డాగా మారిందనీ, చేతులు తడపందే పనులు కావడం లేదన్నారు. ఎక్కువగా భూ సంబంధమైన రికార్డులు వారి చేతుల్లోనే ఉన్నాయనీ, ఇక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. టెక్నాలజీని వాడినా డబ్బులు చేతులు మారకుండా ఉండటం లేదన్నారు. గతంలో కొంత మొత్తం ఇస్తే పనులు అయ్యేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా రూ.లక్షలు చేతులు మారు తున్నాయని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు వెక్కిరిస్తున్నాయన్నారు. నేటి వరకు గ్రామాలకు నక్షాలు లేవన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తులు, భూములు, ఆలయాలకు సంబంధించిన భూములు ఎక్కడున్నాయో? ఎన్ని ఎకరాలు ఉన్నాయో? ప్రభుత్వం వద్ద వివరాల్లేవనీ, వీటిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముందు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలలో ప్రభుత్వ, ప్రయివేటు, ఆలయ భూముల వివరాలు లెక్కలు తేల్చాలనీ, ఇందు కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించాలన్నారు. ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోని భూముల వివరాలను పొందు పర్చాలన్నారు. రెవెన్యూ డిపార్ట్ మెంట్లో ఉన్న సర్వేయర్లు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైందనీ, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలనీ, ముందుగానే డబ్బులు చెల్లించాలనీ, లేకపోతే తిరిగి రీ ఫండ్ రావాలంటే ఇబ్బందులు తప్పడం లేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా నిర్వహిస్తోందన్నారు. అసలు భూములపై హక్కుదారులు కాకుండా ఇంకొందరు పేర్లు కనిపిస్తున్నాయనీ, దీని వల్ల రూ.కోట్లు చేతులు మారుతున్నాయనీ, ఇలాంటి సిస్టం మారాలన్నారు. ధరణి రైతు నేస్తం కాదు.. రైతుల పాలిట శాపం అన్నారు. 10 నిమిషాల్లోనే పూర్తవుతుందని వారం రోజుల్లో పాస్ బుక్ వస్తుందని సీఎం చెప్పిన మాటలు గాలి కబుర్లు అని తేలిందన్నారు. గతంలో 24 ఆప్షన్లు ఉంటే ఇప్పుడు వాటిలో కొన్నే ఉన్నాయన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ జరిగినా ఇంకా మ్యుటేషన్ కాని భూములు వేలాదిగా ఉన్నాయన్నారు. రెవెన్యూ శాఖ కారణంగా రైతుల పేర్లు రికార్డుల్లోకి ఎక్కడం లేదన్నారు. అసలు విస్తీర్ణం కన్నా తక్కువగా నమోదు చేయడం దారుణం అన్నారు. చాలా మంది ఇప్పటికీ రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగు తున్నారనీ, తమ పేర్లు కనిపించడం లేదనీ, దీనికి పరిష్కారం ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ రెక్టిఫికేషన్ , ర్యాటిఫికేషన్ ఆప్షన్ లేదన్నారు. ఫౌతీ ( విరాసత్ )లో లెక్కనేంత జాప్యం జరుగుతోందనీ, ఇది వారసుల పాలిట శాపంగా మారిందన్నారు. సంస్థలకు ఒకరిపైనే రిజిస్ట్రేషన్ చేయడం దారుణం అనీ, జాయింట్ రిజిస్ట్రేషన్ ఉంటే ఇక నరకమే అనీ, అవి రిజిస్ట్రేషన్ కావడం లేదన్నారు. భూముల పరంగా నిత్యం తలెత్తే ప్రధాన సమస్యలు ఆర్ఓఆర్, ఇనామ్, సీలింగ్, అసైన్డ్ వివాదాలు లెక్కనేన్ని ఉన్నాయనీ, వాటికి పరిష్కారం ఏదీ లేదనీ దీనికి సీఎం, ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.