Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్మినార్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఏర్పాటుకు జీహెచ్ఎంసీ చర్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలో భవన నిర్మాణ, కూల్చివేసిన వ్యర్థాలను వెంటనే తీసుకుని పోవడానికి మరో రెండు నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్లను జీహెచ్ఎంసీ త్వరలో ఏర్పాటు చేయనున్నది. వ్యర్థాలను రోడ్డు మీద, ఫుట్‌పాత్, నాలా, చెరువులలో వేయడంవల్ల వాతావరణ కాలుష్యంతో పాటు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ మరో రెండు సీఅండ్‌డీ ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. ఇప్పటికే రెండు ప్లాంట్లను జీడిమెట్ల, ఫతుల్లగూడలలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ రోజుకూ ఒక్కొక్క ప్లాంట్ ద్వారా సుమారు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేస్తున్నారు. తాజాగా సికింద్రాబాద్, చార్మినార్ వైపు మరో 15 సర్కిల్స్‌లో కూల్చివేసిన, భవన నిర్మాణ వ్యర్థాల సేకరణకు జీహెచ్ఎంసీ టెండర్ పిలిచింది. ప్లాంట్ ఏర్పాటుకు నగరానికి 10 కిలోమీటర్ల దూరం, ఐదెకరాలపైబడి సొంత భూమి ఉండాలని పేర్కొన్నది. ఈ నిబంధనల మేరకు రెండు ప్లాంట్లు ఒకే ఏజెన్సీకి దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు. అనుమతి రాగానే జీహెచ్ఎంసీ ఏజెన్సీతో ఎంఓయూ చేసుకోనుంది. ఏజెన్సీతో ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక సంవత్సరంలోపు ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటుకు అవకాశం ఉంది. అప్పటివరకు కేటాయించిన సర్కిల్‌లలో వ్యర్ధాలను తప్పని సరిగా సేకరించాల్సి ఉంటుంది. కూల్చివేసిన, భవన నిర్మాణ వ్యర్థాలు అనుమతిలేని చోట రోడ్డు మీద, ఫుట్‌పాత్, నాలాలోగాని చెరువులలో గాని వేసిన పక్షంలో జరిమానాతో పాటు చట్టరీత్యా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోనుందని అధికారులు చెబుతున్నారు. చార్మినార్, సికింద్రాబాద్‌వైపు ఏర్పాటు చేసే ప్రాసెసింగ్ ప్లాంట్లను రెండు ప్యాకేజీలుగా చేశారు. ప్యాకేజీ 1 కింద చార్మినార్ వైపు ఏర్పాటు చేసే ప్లాంట్‌కు 8 సర్కిళ్లను కేటాయించారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్నామా, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్ ఉన్నాయి. రెండో ప్యాకేజీ ద్వారా సికింద్రాబాద్ వైపు ప్లాంట్‌కి మరో 7 సర్కిళ్లను కేటాయింపు చేశారు. కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్లలో వ్యర్థాలు సేకరించనున్నారు.