Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహుజన విద్యార్థి సంఘాల నాయకుల ఆరోపణ
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ సి హాస్టల్ మరమ్మతు పనుల్లో కోటి రూపాయల కుంభకోణం జరిగిందని బహుజన విద్యార్థి సంఘాలు నాయకులు ఆరోపించారు. మంగళవారం ఓయూలోని సి వసతిగహాన్ని సందర్శించి అన్ని రూమ్‌లను పరిశీలించారు. ఈసందర్భంగా తెలంగాణ బహుజన స్టూడెంట్స్ జాక్ చైర్మెన్ వేల్పుల సంజరు, ఓయూ జాక్ చైర్మెన్ కొత్తపల్లి తిరుపతి, ఉపాధ్యక్షులు పులిగంటి వేణుగోపాల్, సాయికృష్ణ మాట్లాడుతూ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హాస్టల్ రూముల్లో ఊడి పడిపోతున్న సీలింగ్ కప్పులు, రూములలోకి నీరు చేరడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందేమోనని విద్యార్థులు భయాందోళనతో బెంబేలెత్తుతున్నారని ఆవేదనవ్యక్తంచేవారు. గతంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా ఉన్న ప్రొ.రవీందర్ (ప్రస్తుత వీసీ)ని కలిసి సి వసతిగృహం మరమ్మతులకు బదులు అదే స్థలంలో కొత్త హాస్టల్ నిర్మాణం చేపట్టాలని కోరినట్లు చెప్పారు. బహుజన విద్యార్థి సంఘాలుగా తాము చేస్తున్న ఉద్యమాన్ని చూసిన అప్పటి వీసీ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సముఖంగానే ఉన్నారని, కానీ అప్పటి ప్రిన్సిపాల్, కొందరు అధికారులు కలిసి రెండు కోట్ల రూపాయలతో టెండర్ అయిపోయిందని దానిని ఆపడం సాధ్యం కాదని చెప్పారన్నారు. రెనోవేషన్ సమయంలో 4.5 మందం ఉన్న రేకులకు బదులు 0.5 ఉన్న రేకులను పైకప్పులకి వాడితే తాము తీవ్రంగా ప్రతిఘటించడంతో కొన్ని రోజులు పనులు బంద్ చేశారు అని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత అప్పటి ప్రిన్సిపాల్ ప్రొ.రవీందర్ విద్యార్థులకు సెలవుల సమయంలో మళ్లీ హాస్టల్‌ను సందర్శించి మరమ్మతుల పనులను ప్రారంభింపచేశారని చెప్పారు. ఇప్పుడు హాస్టల్ విద్యార్థుల సమస్యలకు మూల కారణం ప్రస్తుత వీసీ రవీందర్, కొందరు అధికారులే అని ఆరోపించారు. సి హాస్టల్ మరమ్మతుల్లో కోటి రూపాయల అవినీతి కుంభకోణం జరిగిందని, ఈ మొత్తం అవినీతి కుంభకోణంపై వీసీ వెంటనే కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూను అవినీతి అధికారుల నుంచి కాపాడాలని వారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.