Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.నాలుగు లక్షల విలువైన డ్రగ్స్, ఆరు సెల్ఫోన్ల స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
పోలీసులకు చిక్కకుండా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న నిందితుడితోపాటు నలుగురు వినియోగదారులను హైదరాబాద్ నార్కోటెక్ ఎన్ఫోర్సుమెంట్ (హెచ్-ఎన్ఈడబ్య్లూ) వింగ్‌తోపాటు ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 36 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌తోపాటు ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ జోయేల్ డేవీస్, సునీతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బెంగుళూరుకు చెందిన జోసెఫ్ చెన్నైకి చెందిన డ్రగ్స్ స్మగ్లర్ నుంచి మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసి హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాలల్లో సరఫరా చేస్తున్నాడు. వాట్సాప్ గ్రూపులను తయారు చేసి గ్రాముకు రూ.7వేల చొప్పున విక్రయిస్తున్నాడు. గచ్చిబౌలికి చెందిన బి.బాలమణికంఠ, కొండాపూర్‌కు చెందిన సీహెచ్ సమంత్రావు, ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన సీహెచ్ సాయి రాఘవేంద్రా, అఖిల్ కుమార్‌లు వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు. డ్రగ్స్‌ను ఆర్డర్ చేసి వినియోగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. ఎస్ఆర్నగర్ పరిధి మధురానగర్‌లోని కేసీఆర్ క్లాసిక్ అపార్టుమెంట్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు సరఫరా దారునితోపాటు నలుగురిని అరెస్టు చేశారు. నిందితుడు రెగ్యులర్‌గా 16 మంది కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తదుపరి విచారణ కోసం నిందితులను ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్టు డీసీపీ తెలిపారు.