Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిపోని కుర్చీలు, అందుబాటులోలేని జనరల్స్
- తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్
- నిర్వహణ సరిగ్గాలేక కంపు కొడుతున్న పరిసరాలు
నవతెలంగాణ-ఓయూ
ఎంతో మంది విద్యార్థుల జీవితాలను చక్కదిద్దే ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ సమస్యల వలయంలో కొట్టు మిట్టాడుతోంది. సరిపోని కుర్చీలు లేక, పోటీ పరీక్షలకు అవసర మైన సబ్జెక్టులు, జనరల్స్ అవసరం మేరకు అందుబాటులో లేక స్టూడెంట్స్ ఇబ్బందిపడుతున్నారు. కనీసం తాగడానికి నీళ్లు సక్రమంగా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఇటీవల వర్షాలకు లైబ్రరీ భవనం పైకప్పు పెచ్చులూ డుతోంది. లైబ్రరీ టాయిలెట్స్ నిర్వహణ సక్రమంగా లేక కంపుకొడుతున్నాయి. వాష్‌రూమ్‌లో అపరిశుభ్రత కారణంగా ఇటీవల ఓ విద్యార్థి జారి కిందపడటంతో గాయాలయ్యాయి. అసలే నోటిఫికేషన్ల వేళ.. విద్యార్థులు ఆయా ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ లో ఉన్న వేళ లైబ్రరీలో వసతులు లేకపోవడంతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఎంతో మంది మేధావులను, సామాజిక, విద్యా, పారిశ్రామిక వేత్తలను, రాజకీయ నాయకులను, తయారు చేసిన ఘనతగల ఉస్మానియా యూనివర్సిటీలోని డా.బీఆర్ అంబేద్కర్ లైబ్రరీకి ఎటువంటి సమస్యలు లేకుండా పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
కంపు కొడుతున్న టాయిలెట్స్
వర్సిటీ లైబ్రరీలో కనీస వసతులు కరువయ్యాయి. నీళ్లు, నిర్వహణ సక్రమంగా లేక, వాష్ రూములు, టాయిలెట్స్ కంపుకొడుతు న్నాయి. మంచినీటి (ప్యూరిఫైడ్ వాటర్) సౌకర్యం లేదు. దీనివల్ల ఇక్కడి విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైట్లు, కుర్చీలు, రీడింగ్ప్యాడ్స్ వంటి వసతులు లేనేలేవు. ఏండ్ల తరబడి ఎదురుచూపు తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో 24 గంటల లైబ్రరీ వసతి కల్పించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నా ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 24 గంటలు అందుబాటులో ఉండేలా లైబ్రరీని అందుబాటులోకి తేవాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఊడిపడుతున్న స్లాబ్స్
ఇటీవల సెల్లార్లో కూడా స్లాబ్ ఊడిపడి ఒక విద్యార్థి స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఇక మార్చి 31న, సోషియాలజీ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి బాత్రూమ్ అపరిశుభ్రంగా, పాకరపట్టి ఉండటంతో జారి కిందపడటంతో కాలు విరిగింది.
బుక్స్, జనరల్స్ లేవు
వర్సిటీ లైబ్రరీలో లేటెస్ట్ అప్డేటెడ్ బుక్స్, జర్నల్స్ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపయోపగకరమైన, విద్యార్థులకు అవసరమైన అన్ని బుక్స్ అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. లైబ్రరీలో మౌలిక వసతులు సరిగా లేకపోవడం, వాష్ రూమ్స్, బిల్డింగ్ రూఫ్ లాంటివి ప్రమాదకర స్థితిలో ఉండటంవల్ల విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ కాలం గడిపే పరిస్థుతులు ఉన్నాయి. ఇప్పటికైనా ఓయూ ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి తగిన సౌకర్యాలు కల్పించాలని, ఓయూ వీసీ ప్రత్యేక చొరవ తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
నిధులు కేటాయించాలి
వందేండ్ల చరిత్రగల ఓయూ లైబ్రరీ సమస్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీని అభివృద్ధికోసం సరిపడా నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఫలితంగా విద్యార్థులు నష్టపోతున్నారు. కనీస సౌకర్యాలైన మంచినీరు, టాయిలెట్స్, పుస్తకాలు, కుర్చీలు, ఫ్యాన్లు, లైట్లు వంటివి తప్పకుండా కల్పించాలి. ఓయూ అడ్మని స్ట్రేషన్ విభాగం విద్యార్థుల సూచనలు, వినతులను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలి.