Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూణేకు చెందిన లైట్‌హౌస్ ఫౌండేషన్‌తో బల్దియా ఒప్పందం
- ఏటా 600 మంది స్లమ్ ఏరియాల్లోని నిరుద్యోగ యువతకు శిక్షణ
- చందానగర్‌లో పైలట్ ప్రాజెక్టుకు నిర్ణయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
సిటీలోని మురికివాడలో నివసిస్తున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సుస్థిరమైన జీవన ప్రమాణాలు పెంపొందిం చేంచేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. మురికివాడల్లో నివసించే 18-35 ఏండ్ల వరకు వయస్సు గల వారికి నైపుణ్య శిక్షణ ఇప్పించి, ప్లేస్‌మెంట్స్ కల్పించేందుకు పూణేకు చెందిన లైట్‌హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్ (ఎల్‌సీఎఫ్)తో బల్దియా ఒప్పందం చేసుకునేందుకు ప్లాన్‌రెడీ చేసుకుంది. ఏటా 600 మందికి శిక్షణ ఇవ్వనుంది. యువతకు ఉద్యోగ, ఉపాధిమార్గం చూపాలన్న ప్రధాన ఉద్దేశంతో శేరిలింగంపల్లి పరిధిలోని చందానగర్‌లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది.
ఎంతో మందికి ఉపాధి
ఇంతకు ముందు కూడా లైట్‌హౌస్ ఫౌండేషన్ పూణే నగర పాలక సంస్థతో ఒప్పందం చేసుకుని వేలాది మందికి ఆయా భాగస్వామ్య సంస్థలు, కంపెనీల్లో ఉపాధి కల్పనకు కృషి చేసింది. ఎలాంటి విద్యార్హత లేని వారికి కూడా స్వయం ఉపాధి కల్పించేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించి, కావాల్సిన ఆర్థిక సాయం అందజేస్తుంది. నైపుణ్య శిక్షణ ద్వారా అనేక మందిని ఆసక్తి గల రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడంతో వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేసింది.
1466 మురికి వాడల్లో
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 4846 కాలనీల్లో సుమారు 1466 నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఇక్కడి నిరుద్యోగ యువతీ యువకులకు సుస్థిర జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు యుద్ధ ప్రాతిపదికన జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టిందని అధికారులు చెబుతున్నారు. అందుకు కావాల్సిన ప్రణాళికను తయారు చేస్తున్నట్టు తెలిపారు.
26 కోర్సుల్లో శిక్షణ
లైట్‌హౌస్ ఆధ్వర్యంలో 26 కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఐటీ, ఐటీఈఎస్‌కు సంబంధించిన ప్రోగ్రాం జావా, సీసీఎన్ఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్, నాన్‌వాయిస్ బీపీఓ, బ్లూ కలర్ కోర్సు, వెబ్‌డిజైనింగ్, కంప్యూటర్ హార్డ్‌వేర్ అండ్ నెట్ వర్కింగ్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాలకు సంబంధించిన రిపేరింగ్, ఫోటోగ్రఫీ, మొబైల్ రిపేరింగ్, బేకరిఫుడ్స్ తయారీ లాంటి ఇతర ప్రోగ్రాముల్లో నమోదు చేసుకున్న వారికి నైపుణ్యత కల్పించనున్నారు. నర్సింగ్, కుకింగ్, బ్యూటీపార్లర్, ఫిట్నెస్ ట్రయినర్, సర్వీస్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన కోర్సుల్లో శిక్షణ కల్పించనున్నారు. ఇవేగాకుండా అభ్యర్థులకు ఇష్టమైన కోర్సులకు ఈ సంస్థ వద్ద లేకున్నా వేరే ట్రయినింగ్ సెంటర్‌కు పంపించి, ఆ ఫీజు కూడా సంస్థ చెల్లించి యువతకు శిక్షణ కల్పించేందుకు కృషి చేయనుంది. ఎంపిక నుంచి నైపుణ్యత, శిక్షణతో పాటు ప్లేస్మెంట్ వరకు బాధ్యత తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ కోర్సుల నిర్వహణకు పెద్ద పెద్ద సంస్థలతోపాటు పూణె ప్రాంతంలో లోకల్స్థాయి సంస్థలతో కూడా భాగస్వామ్యం చేసుకుని ఉపాధి కల్పించనున్నారు.
చందానగర్‌లో పైలెట్ ప్రాజెక్ట్
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్లో పైలెట్ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్లమ్ ఏరియాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సుస్థిరత జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు లైట్‌హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్‌కు సర్కిల్ 21లోని హుడాకాలనీ మోడల్ మార్కెట్ బిల్డింగ్‌ను కేటాయించారు. పైలట్ ప్రాజెక్ట్‌గా ఏడాదిపాటు నిర్వహించేందుకు ఎలాంటి అద్దె లేకుండానే ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది.