Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు పొడవునా దుర్వాసనతో ముక్కు మూసుకోవాల్సిందేనా?
- పట్టించుకోని అధికారులు
- మరమ్మతులు చేయాలి : స్థానికులు
సంతోష్‌నగర్-నవతెలంగాణ
యాకుత్‌పురా నియోజకవర్గం సంతోష్‌నగర్ డివిజన్ పరిధిలోని క్రిస్టల్ రెస్టారెంట్ వద్ద గత 15 రోజులుగా డ్రైనేజీ మురికి నీరు పొర్లుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నెలలు తరబడి పొంగిపొర్లుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. డ్రైనేజీ సమస్య అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే దాఖలాలు లేవని బస్తీివాసులు ఆరోపిస్తున్నారు. వాటర్ వర్క్స్ పరిధిలోని ఆయా ప్రాంతాలలో నిత్యం డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపై పొంగి పొర్లుతూ ప్రవహిస్తుంది. డివిజన్ పరిసర ప్రాంతాల్లో నిత్యం ప్రదక్షిణలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆయా ప్రాంతాల వాసులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు ఓవైసీ చౌరస్తా, చంద్రాయణగుట్ట, శ్రీశైలం వైపు వెళ్లే హైవే రహదారి నుండి సంతోష్‌నగర్, ఐఎస్ సదన్, మాదన్నపేట్, సైదాబాద్, మలక్‌పేట, కోఠి, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ప్రతిరోజు ప్రయాణికులు వేల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు.
ఇకపోతే సమీపంలో ఉన్న పాఠశాలలు, దేవాలయాలు స్థానికులు, పాదచారులు వాహనదారులు చిరు వ్యాపారస్తులు పరిధిలోని వివిధ ప్రాంతాలలో పొంగిపొర్లుతుండగా పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా ఇక్కడి అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆయా ప్రాంతాల నివాసులు పేర్కొంటున్నారు. ఎప్పుడు చూసినా అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, దీంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో అయోమయంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు అందుబాటులో ఉండటంలేదని, ఇక్కడి క్రింది స్థాయి సిబ్బంది తమకు ఏమీ తెలియదని తప్పించుకుంటున్నారు అని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూలు సమయంలో నిత్యం పొంగిపొర్లుతూ రోడ్లు దుర్గంధం వెదజల్లుతూ జలాశయాలను తలపిస్తున్నాయి. వర్షాలు కురిస్తే వరదనీటితో పొంగిపొర్లి డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూతలు సైతం పోతాయని, అలాంటి సమయములలో రాకపోకలు సాగించడానికి భయాందోళనలకు గురవుతున్నారని అటు ప్రజలు, ఇటు వాహనదారులు, పోలీసులు వాపోతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించి తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారని, ప్రాణాలు పోతే తప్ప పట్టించుకోరా అని వాటర్ వర్క్స్ అధికారులను స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. డ్రైనేజీ పొంగి పొర్లుతుండటంతో పనులు నిలిచిపోయాయి. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా వాటర్ వర్క్ప్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని పొంగిపొర్లుతున్న డ్రైనేజీ సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాలవాసులు కోరుతున్నారు.