Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ
- 2020లో రూ.400 కోట్లే వసూలు
- ఈ సారైనా ఫలించేనా?
- జీహెచ్ఎంసీ ఖజానా నిండేనా?
- గతేడాది నామమాత్రపు స్పందన
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్లో చాలా కాలంగా పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేయడానికి సర్కార్ మరోసారి వన్‌టైం స్కీం (ఓటీఎస్) ప్రకటించింది. 2020లో కరోనా సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఓటీఎస్‌కు స్పందన నామమా త్రంగానే వచ్చిన విషయం తెల్సిందే. రాష్ట్ర ఖజానాలో నిధుల్లేక పోవడంతో మరోసారి పాత బకాయిలపై సర్కార్ దృష్టి సారిం చింది. జీహెచ్ఎంసీని సైతం నిధుల కొరత వేధిస్తోంది. ఎస్ఆర్ డీపీ, సీఆర్ఎంపీ, డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం, ఉద్యోగుల వేతనాలు బల్దియాపై పెనుభారంగా మారాయి. ఈ తరుణంలో ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేయడానికి సర్కార్ చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా, లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడం, వ్యాపారాలు దెబ్బతినడం, వాణిజ్యరంగాలపై తీవ్ర ప్రభావంతో వసూలు కాకపోవడం ఒకెత్తయితే భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన నగరవాసులు బకాయిలు చెల్లించడానికి ముందుకు రాలేదు. 2020 నవంబర్ 15వరకు గడువు ఇచ్చినా ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. ఈ సారి అక్టోబర్ 31 వరకు అవకాశం కల్పించారు. ఆశించిన స్థాయిలో వసూలవుతుందా? లేదా అనేది చూడాల్సిందే.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాత బకాయిల వసూళ్లపై దృష్టి సారించింది. ఇప్పటికే అప్పుల పాలైన బల్దియా ఆదాయం కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. సర్కార్ ప్రకటించిన ఓటీఎస్‌లో భాగంగానే 15-20 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలను వసూలు చేయడానికి కసరత్తు చేస్తోంది. ఆస్తిపన్ను బకాయిలు చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయనున్నట్టు ఉత్తర్వులో పేర్కొంది. బకాయిలతోపాటు 10శాతం వడ్డీని అక్టోబర్ 31లోగా చెల్లించాలని బల్దియా ప్రకటించింది. ఈ స్కీమ్‌ను వినియోగించుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని జీహెచ్ఎంసతీ నిర్ణయించింది.
బకాయిదారులు 5 లక్షలపైనే
జీహెచ్ఎంసీ పరిధిలో 5లక్షల మందికిపైగా ఆస్తిపన్ను పాత బకాయి దారులు ఉన్నారు. 10శాతం వడ్డీతోపాటు పాతబకాయిల ను సోమవారం నుంచి అక్టోబర్ 31వరకు చెల్లించాల్సి ఉన్నది. గ్రేటర్లో 16లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సుమారు 10లక్షల మంది రూ.1,495 కోట్లు చెల్లించారు. మరో 5 లక్షల మంది నుంచి రూ.1,500 కోట్లకుపైనే ఆస్తిపన్ను బకాయిలతోపాటు వీటిపై వడ్డీ రూ.1,000 కోట్లు రావాల్సి ఉంది. అయితే ఓటీఎస్‌లో 90 శాతం వడ్డీ మాఫీ చేయడంతో జీహెచ్ఎంసీ ఖజానాకు పాతబకాయిలు సుమారు రూ.1,500 కోట్లతోపాటు 10 శాతం వడ్డీ రూ.100 కోట్లు కలిపి మొత్తం రూ.1,600 కోట్లు రావాల్సి ఉంది. అయితే 2020 నవంబర్ 15వరకు కొనసాగిన ఓటీఎస్‌కు నామమాత్రం గానే స్పందన వచ్చింది. పాతబకాయిలు, వడ్డీ కలిపి రూ,1547 కోట్లకుగాను రూ.400 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ సారైనా ఆశించిన స్థాయిలో వసూలవుతుందా? లేదా? చూడాల్సిందే.