Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైభవంగా ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర
- తొలిబోనం, పట్టు వస్త్రాలు సమర్పించిన
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖలు
- భక్తుల కోలాహలంతో కళకళలాడిన ఆలయ ప్రాంగణం పరిసర ప్రాంతాలు
- నేటి రంగం ఏర్పాట్లకు సిద్ధం
నవతెలంగాణ-సిటీబ్యూరో/బేగంపేట
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు బోనాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళల కోలాటాలు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, డప్పుల దరువులు, యువతీ, యువకుల నృత్యాల కోలాహాలు, ఆనందోత్సవాల మధ్య అమ్మవారి బోనం, సాక సమర్పించేందుకు వచ్చే భక్త జనసందోహంతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా సాగింది. కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో సందడిగాకనిపించాయి. ఉదయం నుంచే క్యూ కట్టారు. దీంతో స్థానిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు క్యూలో ఉన్న భక్తులకు తాగునీరు, అల్పాహారం అందించారు.
మంత్రి తలసాని కుటుంబం మొదటి పూజ
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున 4 గంటలకు ఆలయానికి వచ్చారు. ఆయనకు ఆలయ ఈవో గుత్తా మనోహార్ రెడ్డి, వేద పండితులు, అర్చకులు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు, కుటుంబ సభ్యులతో సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాధారణ భక్తులను అనుమతించారు.
ప్రముఖుల ప్రత్యేక పూజలు
ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి సూరెపల్లి నంద, పీసీపీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ నాయకులు బోస్ రాజు, మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ముఠా గోపాల్, బేతి సుభాష్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మెన్ కృష్ణ మోహన్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, గీతా రెడ్డి, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు గజ్జల నగేష్, రాజీవ్‌సాగర్, నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి, ముప్పిడి గోపాల్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, కార్పొరేటర్లు చీర సుచిత్ర, కొంతం దీపిక, సరళ, సామల హేమ, మాజీ కార్పొరేటర్ లాస్య నందితలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గాయని మంగ్లీ బోనంతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌లు అమ్మవారిని దర్శించుకుని అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు.
బంగారు బోనంతో కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంగారు బోనంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదయ్యనగర్ నుంచి 500 బోనాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ సాయికిరణ్ యాదవ్‌లతో కలిసి అక్కడి నుంచి ఆలయానికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. ఎమ్మెల్సీతో పాటు హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు.
సాఫీగా భక్తుల దర్శనం
ఈ ఏడాది భక్తులకు క్యూలైన్లలో ఎక్కడా ఇబ్బందులు ఏర్పడలేదు. ఈవో గుత్తా మనోహర్ రెడ్డితో పాటు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టడంతో భక్తులు సాఫీగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత దేవాలయం నుంచి బయటకు వెళ్లేందుకు 3 గేట్లు ఏర్పాటు చేయడంతో భక్తులు త్వరితగతిన వెళ్లిపోయారు. దీంతో ఎక్కడ భక్తులు భారీగా వేచిఉండడం కనిపించలేదు.
నేడే భవిష్యవాణి..
అమ్మవారి బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం జరగనుంది. రంగంలో స్వర్ణలత పచ్చికుండపై నిలుచుని భవిష్యవాణిని వినిపిస్తుంది. ఉదయం 9.30 గంటలకు అమ్మవారి గర్భగుడికి ఎదురుగా మాతంగేశ్వరీ దేవాలయం ఎదుట ఆమె భవిష్యవాణి వినిపించనున్నారు.