Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీయూడీఎఫ్ (పట్నం) సంఘం అధ్యక్షుడు సాయి శేషగిరిరావు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
బోరబండ సైట్-3, స్వరాజ్ నగర్లోని పీహెచ్సీ సెంటర్లలో ఇద్దరు మహిళ డాక్టర్లు మాత్రమే పనిచేస్తున్నారని, మరో ఇద్దరు వైద్యులతోపాటు ఫార్మసిస్టులను నియమించాలని టీయూడీఎఫ్ (పట్నం) సంఘం అధ్యక్షుడు సాయి శేషగిరిరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బోరబండ డివిజన్లో ఉన్న రెండు ప్రభుత్వ దవాఖానలను సందర్శించి అక్కడున్న సౌకర్యాలను పరిశీలించారు. బోరబండ పరిధిలో 60 వేల మంది, స్వరాజ్ నగర్లో 63వేల మంది ప్రజలు రెండు హాస్పిటల్లో వైద్యం కోసం వస్తుంటారని, రెండు చోట్ల ఒక్కరే డాక్టర్లు ఉన్నందున డాక్టర్ శ్రీవల్లి, డాక్టర్ జుబేరియా బేగం లపై అధిక భారం పడుతుందన్నారు. వెంటనే మరో ఇద్దరు డాక్టర్లు నియమిస్తే పేదలకు మంచి సేవలు అందించవచ్చని తెలిపారు. అదే విధంగా ఇక్కడ నాలుగో తరగతి ఉద్యోగుల కొరత ఉందని, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లేరని చెప్పారు. ప్రతిరోజు సుమారు 100 మందికి పైగా అవుట్ పేషెంట్లుగా వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని, వారి వివరాలు ఆన్లైన్లో పొందుపరచుటకు చాలా ఇబ్బందిగా ఉందని అన్నారు. హాస్పిటల్స్ ఆవరణలో డ్రయినేజీ జామై పొంగిపొర్లుతున్నాయని, దోమలు విపరీతంగా ఉన్నాయని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు వెంటనే స్పందించి పీహెచ్సీ సెంటర్లలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు చింతల శ్రీను, దాదిమల్ల కష్ణ, సికిందర్, రవి తదితరులు పాల్గొన్నారు.