Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనరజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాచర్ల ఉప్పలయ్య
- మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డికి వినతి
నవతెలంగాణ-అడిక్మెట్
తెలంగాణలో ఎటువంటి గుర్తింపు లేని రజక సంఘాలను, వేదికలను వెంటనే రద్దు చేయాలని మనరజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల ఉప్పలయ్య గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షులు పెద్దఊరే బ్రహ్మయ్య అన్నారు. ఆదివారం మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కులాల ఆత్మగౌరవ భవనాల కోసం అనేక చోట్ల స్థలాలు, నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆయా నిర్మాణాలు వివిధ కులాల పేర్లతో, అనేక సంఘాలు ఉన్న క్రమంలో ఒకే కులం ఒకే సంఘంగా ఏర్పడి వస్తే వారికే భవన నిర్మాణ బాధ్యతలు చేపడతామని చెప్పారని గుర్తుచేశారు. వెయ్యి రూపాయలతో రాష్ట్ర సంఘం అని రిజిస్ట్రేషన్ చేసుకొని స్వయం ప్రకటిత నాయకులు, ఎన్నడు ఒక్క సభ కానీ కార్యక్రమం లేదా సంక్షేమ కార్యక్రమాలు చేయనివి నూటికి 95 శాతం ఉన్నాయన్నారు. ఈ సంఘాలతో రజకులకు ఎటువంటి ప్రయోజనం లేదని తెలిపారు. మన రజక సంఘం రాష్ట్రంలోని 33 జిల్లాలని పర్యటించి అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో సొసైటీ ఆక్ట్ ప్రకారం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్ని సంఘాలు ఏకతాటి పైకి వచ్చి మన రజక సంఘంతో మమేకమై రజక ఆత్మగౌరవ భవనం ఏర్పాటుకు సహకరించాల్సిందిగా కోరారు.