Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పి.విద్యాసాగర్ రెడ్డి
- రామచంద్రా రెడ్డి స్మారక పోస్టల్ కవర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-బంజారాహిల్స్
తొలి భూదాన ఉద్యమకారుడు వెదిరె రామచంద్రారెడ్డి చేసిన భూదానం దేశానికి స్ఫూర్తిదాయకమని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పి.విద్యాసాగర్ రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రామచంద్రా రెడ్డి 117వ జయంతి సందర్భంగా పోస్టల్ శాఖ రూపొందించిన 'వెదిరె రామచంద్రా రెడ్డి స్మారక పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. అలాగే ఆయన భూదానం చేస్తూ లిఖితపూర్వకంగా రాసిచ్చిన 'స్వదస్తూరి పత్రాన్ని'లో సభలో ప్రదర్శించారు. అనంతరం డాక్టర్ పి.విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ ఆచార్య వినోబాబావే చేపట్టిన ఉద్యమంలో తొలుత భూదానం చేసిన గొప్ప సంఘసంస్కర్త వెదిరె రామచంద్రారెడ్డి అని, ఆయన భూదానంతోనే దేశంలో భూదాన ఉద్యమం ప్రారంభం కావడం చరిత్రాత్మకమైందని కొనియాడారు. తెలంగాణ విముక్తి కోసం సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన కమ్యూనిస్టు మహానాయకుడు రావి నారాయణరెడ్డి స్వయంగా రచ్చించిన 'వీర తెలంగాణ' పుస్తకంలో రామచంద్రారెడ్డి భూదానం గురించి రాయడం ఆయన త్యాగ నిరతికి నిదర్శనమన్నారు. రామచంద్రారెడ్డి భూదానం చేయడం ద్వారా దాన గుణానికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. అఖిల భారత సర్వ సేవా సంఫ్‌ు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు వెదిరె అరవింద్ రెడ్డి మాట్లాడుతూ వినోబాబావే ఒక్క రక్తం బొట్టు లేకుండా ఐదు లక్షల ఎకరాల భూమిని సేకరించిన భూదాన ఉద్యమంలో తొలి అడుగు వేసింది తెలంగాణాకు చెందిన రామచంద్రా రెడ్డి కావడం గర్వకారణమన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సిద్దాంతాలను ఆచరిస్తూ గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించాలనే లక్షంతో వినోబాబావే చేపట్టిన సర్వసేవా సంఫ్‌ు ఉద్యమంలో భాగంగా ఆయన తెలంగాణ ప్రాంతం నుంచే భూదాన ఉద్యమాన్ని చేపట్టారని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో స్పందించి భూదాన్ యజ్ఞ బోర్డును ఏర్పాటు చేసి ఇప్పటికీ మిగిలి ఉన్న వేల ఎకరాల భూదాన భూములను రాష్ట్రంలోని నిరుపేదలకు పంపిణీ చేయాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రవీంద్రచారి మాట్లాడుతూ వెయ్యి ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప ఉద్యమకారుడు వెదిరె రామచంద్రా రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయమన్నారు. నేటి తరానికి రామచంద్రా రెడ్డి చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రామచంద్రారెడ్డి చరిత్రను పాఠ్యాంశాలను పుస్తకాల్లో పొందుపర్చాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్ ట్యాంక్ బండ్ రామచంద్రా రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో భూదాన ఉద్యమ నాయకులు పి.వీరా రెడ్డి, డాక్టర్ తిమ్మా రెడ్డి, చైతన్య రెడ్డి, టి.కష్ణాగౌడ్, సుభాష్ రెడ్డి, రామచంద్రారెడ్డి, నీలకంఠ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.ఆదిరెడ్డి, నాయకులు రాజశేఖర్ రెడ్డి, తపాలా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు మన్మథరావు, జె.శ్రీనివాస్, ఎస్ వెంకట్ సాయి తదితరులు పాల్గొన్నారు.