Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలానగర్ డివిజన్లో కానరాని స్వచ్ఛత
- పూర్తి స్థాయిలో అమలుకాని చెత్త సేకరణ
- ఓపెన్ గ్యార్బెేజ్ డబ్బాల తొలగింపుతో సమస్యలు
- జాతీయ రహదారుల పక్కనే వ్యర్థాలు డంపింగ్
నవతెలంగాణ-బాలానగర్
పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం పట్టణప్రగతి, స్వచ్ఛ హైదరాబాద్ వంటి కార్యక్రమాలు చేపడుతోంది. అయినా ఏదోఒకచోట నిర్లక్ష్యం కనిపిస్తోంది. కూకట్పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధిలోని బాలానగర్, ఫతేనగర్ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తోంది. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛ నగరమంటూ జీహెచ్ఎంసీ వివిధ కార్యక్రమాలు చేపట్టింది. ఆటో ట్రాలీల ద్వారా ఇంటింటికీి తిరిగి చెత్త సేకరిస్తోంది. తడి, పొడి చెత్త సేకరణ డబ్బాలను ప్రతి ఇంటికీ పంపిణీ చేసింది. అయితే సర్కిళ్లలో గ్యారేజ్ డబ్బాలను, మినీ చెత్త సేకరణ ఏరియాలను తొలగించింది. కానీ డబ్బాలు, మినీ చెత్త డంపింగ్ ఏరియాలను తొలగించినా చుట్టుపక్కలవారు, స్థానికులు చెత్తను మాత్రం ఆయా స్థలాలలో వేయడం కొనసాగిస్తున్నారు. ఫలితంగా చెత్త పేరుకుపోతోంది. ఇంటింటి నుంచి చెత్త సేకరణకు నెలకు రూ.80 వరకు డబ్బులు ఇస్తుండటమే ఇందుకు కారణం. వెళ్తూ వెళ్తూ చెత్త కుప్పలో పడేస్తే అయిపోతుందన్న ఉద్దేశంతో చాలామంది తమ ఇంటిలోని చెత్తను ఇంటిముందుకు వచ్చే ఆటోలో వేయకుండా చెత్త కుప్పలో పడేస్తున్నారు. నెలకు చెల్లించాల్సిన రూ.80 మిగులుతాయి అని చాలామంది మధ్యతరగతి కుటుంబాల వారు ఇలా చేస్తున్నారు. దీంతో పలు ఏరియాల్లో చెత్త పేరుకుపోతోంది. భారీ వర్షంవల్లనో, మరేదైనా కారణంతో ఒకటీ రెండు రోజులు ఇక్కడి నుంచి చెత్తను తరలించకపోతే ఇబ్బందికరంగా మారుతోంది. దుర్వాసన వెదజల్లు తోంది. రోగాల వ్యాప్తికి కారణం అవుతోంది. ప్రస్తుతం కూకట్పల్లి, మూసాపేట జంట సర్కిళ్లలో ఇది సమస్యగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలేక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచి సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న తలంపుతో ఎన్ని ప్రణాళికలు రూపొందించినా, మరెన్ని ప్రయోగాలు చేసినా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా పారిశుధ్య నిర్వహణ అనేది పూర్తిస్థాయిలో అమలు కావడంలేదు. ప్రజల్లో అవగాహనలోపం, నిర్లక్ష్యం ఒక వంతు కారణం అయితే, జంట సర్కిళ్లలో అధికారులు, సిబ్బందికి చిత్తశుద్ధి లేకపోవడంవల్ల చెత్త సమస్య ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారుతోందని కూడా పలువురు విమర్శిస్తున్నారు.
తరలింపులో నిర్లక్షం
పట్టణ ప్రగతి, స్వచ్ఛ హైదరారాబాద్ పేరు ఏవైనా, లక్ష్యం ఎంత గొప్పదైనా ఆచరణలో అది అమలైనప్పుడే సత్ఫలితాలు ఉంటాయి. చెత్త రతలింపులో చాలా కాలనీల్లో, బస్తీల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. బాలానగర్ హనుమాన్ టెంపుల్ మార్గంలో, గౌతమ్‌నగర్, ఎన్.ఎస్.కెకె స్కూల్ ప్రాంతాలలో, ఫతేనగర్ పైప్‌లైన్ రోడ్డులో జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంటింటి నుండి సేకరించిన చెత్తను రిక్షాలలో తరలించి రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో వేస్తుండటం, ఎక్కడికక్కడే చెత్తకు నిప్పు పెడుతుండటం బాలానగర్, మూసాపేట డివిజన్ల పరిధిలో తరచుగా జరుగుతోంది. పరిసర ప్రాంతాల్లో పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పకడ్బందీగా 'స్వచ్ఛ' నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.