Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతంలోనూ నకిలీ వేలి ముద్రలు
- తాజాగా గోషామహల్లో కృత్రిమ వేలిముద్రలు
- ఉన్నతాధికారుల పాత్రపై ఆరా
- బల్దియా ఖజానాకు ఏడాదికి రూ.74.73 కోట్ల నష్టం
- ప్రేక్షక పాత్రలో విజిలెన్స్ విభాగం
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో నకిలీల దందా నడుస్తోంది. పారిశుధ్య విభాగంలో చోటు చేసుకు న్న సింథటిక్ ఫింగర్ ప్రింట్స్ బాగోతమే ఇందుకు నిదర్శనం. నకిలీ కార్మికులు, సింథటిక్ వేలిముద్రలతో ప్రజా ధనాన్ని లూటీ చేయడం ఇదే మొదటి సారికాదు. గతంలోనూ నకిలీ కార్మికుల పేరుతో సింథటిక్ ఫింగర్ ప్రింట్స్‌తో రూ.కోట్ల వేతనాలను కాజేశారు. దీంతోపాటు సికింద్రాబాద్ జోన్ పరిధిలో నకిలీ జనన, మరణ ధృవపత్రాల ముఠాను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనల్లో ఉన్నతాధికారుల పాత్ర సైతం ఉందని తేలింది. ఈ ఘటనల్లోనే మెడికల్ ఆఫీసర్లు, స్టాటిటికల్ ఆఫీసర్లను సైతం జీహెచ్ఎంసీ నుంచి బదిలీ చేశారు. గోషామహల్ సర్కిల్ పరిధిలో జరిగిన కృత్రిమ వేలిముద్రల వ్యవహారంలో ముగ్గురు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్ర కూడా లేకపోలేదనే ప్రచారం జరుగుతుంది. జీహెచ్ ఎంసీలో ఇంత జరుగుతున్నా విజిలెన్స్ విభాగం ఏం చేస్తుందనే విమర్శలొస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఫిర్యాదులతో పెనాల్టీ వేస్తూ హడావుడి చేస్తున్న అధికారులు రూ.కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఏడాదికి రూ.74.73 కోట్లు..
శానిటేషన్ విభాగంలో నకిలీ కార్మికులను సృష్టించి సింథటిక్ వేలిముద్రలతో ఏడాదికి రూ.74.73 కోట్లు కాజేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఎన్ని ఏండ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఖాజానాలో నిధుల్లేక అప్పులతో కాలం వెళ్లదీస్తుంటే నకిలీ కార్మికుల పేరుతో భారీ మొత్తంలో నిధులను కాజేస్తుంటే నిఘా విభాగం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్లో పారిశుద్ధ్య కార్మికుల అటెండెన్స్‌ను బయోమెట్రిక్ మిషన్ల ద్వారా తీసుకుంటు న్నారు. ఆయా సర్కిళ్లలో వేర్వేరు సమయాల్లో అటెండెన్స్ తీసుకుంటున్నారు. పని ప్రారంభించే ముందు బయోమెట్రిక్ మిషన్‌లో లాగ్ఇన్, పూర్తయ్యాక లాగ్ఔట్ చేసేవిధంగా కార్మికులు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది. రోజువారీగా హాజరును తీసుకుంటున్న ఎస్ఎఫ్ఏలు భారీగా డబ్బును కాజేయాలని పథకం వేశారు. కొంత మంది తమకు తెలిసిన కార్మికులను బయోమెట్రిక్ మెషిన్లో నమోదు చేశారు. హాజరు తీసుకోవడం కష్టంగా మారడంతో సింథటిక్ వేలిముద్రలను తయారు చేసి రోజువారీగా హాజరుతీసుకుంటూ వేతనాలు కాజేశారు. ఇలా గోషామహల్, మలక్‌పేట్ సర్కిళ్ల పరిధిలోనే 21 మంది కార్మికులకు చెందిన నకిలీ వేలిముద్రలను తయారు చేశారు. ఇలాంటి నకిలీ కార్మికులు జీహెచ్ఎంసీ పరిధిలో ఇంకా ఎంతమంది ఉన్నారో అనేదానిపై అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం.
పాత్రదారులుగా ఎస్ఎఫ్ఏలు
పారిశుధ్య విభాగంలో ఎస్ఎఫ్ఏలు కింగ్మేకర్లుగా ఉన్నారు. ఉన్నతాధికారులు వీరి అండగా ఉంటున్నారనీ, అధికా రుల అండలేకపోతే ఇంత భారీ మొత్తంలో నిధులు కాజేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. ముగ్గురు ఎస్ఎఫ్ఏలను అరెస్టు చేసిన పోలీసులు ఉన్నతాధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలోనే కాకుండా పారిశుధ్య కార్మికులకు వేతనాల్లో కమీషన్ తీసుకోవడం, కార్మికుల బ్యాంకు పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులను ఎస్ఎఫ్ఏల పాత్ర కీలకం. కొంత మంది ఎస్ఎఫ్ఏలు కార్మికులను సంబంధించిన ఫీఎఫ్ను అక్రమంగా డ్రా చేసుకుంటున్నారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఉద్యోగంలో నుంచి తీసేస్తామని కార్మికులను బెదిరింపులకు గురిచేస్తున్నట్టు కార్మికులు చెబుతున్నారు. ఎస్ఎఫ్ఏలు వసూలు చేసిన సొమ్ములో ఉన్నతాధికారులకు సైతం వాటా ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది.