Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల నాయకులు సాయి శేషగిరిరావు
నవతెలంగాణ-జూబ్లీహిల్స్/హైదరాబాద్
జీహెచ్ఎంసీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ప్రజాసంఘాల నాయకులు సాయి శేషగిరిరావు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జులై 20న గోల్కొండ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించనున్న నగర మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం బోరబండ బస్టాప్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ స్వీపర్ కార్మికులందరికీ నెలకు రూ. 26 వేల వేతనం ఇవ్వాలని, కార్మికులను పర్మినెంట్ చేసి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీలో పనిచేసే కార్మికులందరూ తప్పకుండా 20న జరిగే మహాసభలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో తులసి భారు, కమలాభారు, నాగమ్మ, నాగమణి, లక్ష్మమ్మ, నాగేష్, మల్లేష్, ఉప్పలయ్య పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ చాంద్రాయణగుట్ట జోన్ కమిటీ కార్యదర్శి ఎస్.కిషన్ డిమాండ్ చేశారు. ఈనెల 30 జులై చేపట్టిన తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ హైదరాబాద్ సౌత్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం చాంద్రాయణగుట్టలో జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగులతో ప్రచార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులు ఏండ్ల తరబడి చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకుంటూ అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక పక్క ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్న ప్రభుత్వం పెరిగిన రేట్లకు అనుగుణంగా జీతాలు పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు రూ.21 వేలు వేతనం అమలు చేస్తున్నా తెలంగాణలో వేతనాల పెంపు విషయం మాట్లాడని పరిస్థితి ఉందన్నారు. దీనికితోడు జీహెచ్ఎంసీని ప్రయివేట్ చేయాలని, రాంకీ సంస్థకు అప్పజెప్పాలని ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. కొన్ని వేల కుటుంబాలు జీహెచ్ఎంసీపై ఆధారపడి ఔట్సోర్సింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారని, ప్రయివేట్ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈనెల 30 జులై చేపట్టిన సౌత్ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.