Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- ప్రభుత్వ పాఠశాలలో నోట్‌బుక్స్ పంపిణీ
నవతెలంగాణ-బోడుప్పల్
ఏకాగ్రతతో చదివినప్పుడే మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉంటుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటపల్లి జనార్దన్‌రెడ్డితో కలిసి పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్థానిక మేయర్ జక్క వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో ముద్రించిన ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చే బాధ్యత టీచర్స్‌పై ఉందని, అదే సందర్భంలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని, దీనికోసం రూ.7200 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈఏడాది అనేక చోట్ల నో అడ్మిషన్ బోర్డులు ఏర్పాటు చేశారంటే ప్రభుత్వ పాఠశాలల తీరు ఎలా మారిందో అలోచించాలని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం మనఊరు-మనబడి అనే పథకం చాలా ఉపయోగ పడుతుందని చెప్పారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారికి సర్కారు తరుపున స్కాలర్షిప్ అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పీర్జాదిగూడ కమిషనర్ డాక్టర్ రామకష్ణ రావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రామేశ్వర్ గౌడ్, ఎంఈవో శశిదర్ రెడ్డి, మేడిపల్లి ప్రధానోపాధ్యాయుడు సత్యప్రసాద్, స్కూల్ హెచ్ఎం సుశీలా, స్థానిక కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్ పాల్గొన్నారు.
విద్యార్థులకు ఆర్థిక సాయం
మేడిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో జీపీఏ 10/10 సాధించిన విద్యార్థులకు రూ.పదివేల చొప్పున స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి అందించారు. అదే విధంగా టీచర్లు తక్కువ ఉండడం మూలాన విద్యార్థులకు ఇబ్బందులు ఉండకుండా ఇద్దరు విద్యావాలంటీర్లను తన సొంత నిధులతో నియమించినట్లు హరిశంకర్ రెడ్డి తెలిపారు.