Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- సీఐటీయు బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి, మూసాపేట్ జంట మున్సిపల్ సర్కిళ్లలో కొన్ని రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోందని, దానిని నివారంచడంలో జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని సీఐటీయూ బాలానగర్ మండల కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్ అన్నారు. మంగళవారం కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ బాలానగర్ డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీలల్లో కలుషితనీరు వస్తుండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, ఆ నాటివల్ల రోగాలు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ముఖ్యంగా గర్భిణులు అనారోగ్యాలబారిన పడుతున్నారని చెప్పారు. ఇటీవల వర్షాల కారణంగా గోదావరినీరు తాగునీటి సరఫరా పైప్లైన్లల్లో కలిసి కలుషితమవుతున్నా వాటర్వర్క్స్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించక పోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తప్పని పరిస్థితుల్లో కలుషిత తాగు నీరు వాడడంవల్ల ప్రజలు అనారోగ్యానికి గరైతే ప్రజా ప్రతినిధులు, అధికారులే అందుకు బాధ్యత వహించాలన్నారు. నిరసన కార్యక్రమంలో భారతి, రహీమాబేగం, అనిత, లక్ష్మి, ఉమా తదితరులు పాల్గొన్నారు.