Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూలో విద్యార్థి సంఘాల ఆందోళన
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై వీసీ అణచివేత చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు విద్యార్థి సంఘాల ప్రతినిధులు తెలిపారు. పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని గురువారం ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఓయూ వీసీని కలిసేందుకు విద్యార్థులు ప్రయత్నాలు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు నాలుగు అక్షరాలు నేర్పుతున్న ఓయూను ప్రయివేటీకరిస్తున్న చర్యల్లో భాగంగా పీహెచ్డీ సీట్లను ప్రయివేట్ కాలేజీలకు అప్పగించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పరిశోధన చేయాలకునే విద్యార్థులకు ఆరేండ్లుగా నోటిఫికేషన్ జారీ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఇన్ని రోజులు అడ్మిషన్ కోసం నిరీక్షించిన విద్యార్థులకు అన్యాయం చేసే విధంగా కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. వీసీని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన విద్యార్థులకు తనని కలిసే అనుమతి ఇవ్వకపోగా నిరంకుశంగా పోలీసుల సహకారంతో విద్యార్థులపై దాడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పోలీసులు చేసిన దాడిలో కొంత మంది విద్యార్థి నాయకులు గాయాలయ్యాని చెప్పారు. ప్రశ్నించే విద్యార్థులను, తమ హక్కుల కోసం డిమాండ్ చేస్తున్న విద్యార్థులను అరెస్టులు చేయించడం, అణచి వేయడం చేస్తున్న వీసీ చర్యలను అందరూ ఖండించాలన్నారు. అలాగే అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.