Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరుకైన రేకుల షెడ్డులో వైద్య సేవలు
- పగిలిన పైకప్పు, కూర్చోవడానికి కుర్చీలు, మరుగుదొడ్లకు డోర్స్ కరువు
- వైద్య పరికరాలకు రక్షణ అంతంతే
- మౌలిక వసతుల్లేక ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, పేషంట్స్
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
చిలకలగూడ యూపీహెచ్సీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పక్కా భవనం, వైద్య పరికరాలకు రక్షణ, సరిపడా కుర్చీలు, మరుగుదొడ్లకు డోర్లు లేక గర్భిణులు, పేషంట్లు, డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుత్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో వైద్య సిబ్బందితోపాటు రోగులు సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
నవతెలంగాణ-ఓయూ
రోగమొస్తే పెద్దాస్పత్రులకు వెళ్లలేని పేదల కోసం సర్కార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించకపోవడంతో ఎక్కడికక్కడే సమస్యలు తిష్టవేసి కూర్చున్నాయి. ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతుల కల్పనపై లేదు. దీంతో సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్మండి డివిజన్లోని మార్కండేయనగర్ ఫ్రైడే మార్కెట్ సమీపంలోని చిలకలగూడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలు క్రమేణా పెరుగుతున్నాయి. ఈ యూపీహెచ్సీకి నిత్యం చుట్టుపక్కల 10 బస్తీల నుంచి వందల సంఖ్యలో రోగులు వస్తూ ఉంటారు. డాక్టర్తో పాటు 10 మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 100 నుంచి 200 వరకు ఓపీ ద్వారా ఆరోగ్య సేవలు పొందుతున్నారు. తక్కువ విస్తీర్ణంలో రేకుల షెడ్డులో కొనసాగుతున్న ఈ పీహెచ్సీకి పై కప్పు ఉన్నా రేకులకు భారీగా రంధ్రాలు ఏర్పడ్డాయి. వృద్ధులు, గర్భిణులు కూర్చోవడానికి కసీనం కుర్చీలు కూడా సరిపడాలేవు. దీంతో టెస్ట్స్, చెకప్స్ కోసం వచ్చే రోగులు, గర్భిణులు ఎండలో నిలబడలేక సమీపంలో ఉన్న చెట్లకింద, పార్కులో సేద తీరుతున్నారు. దీనికితోడు ప్రాథమిక సౌకర్యాల ప్రధాన వనరులైన మూత్రశాల ఒక్కటే ఉన్నా దానికి డోర్ లేకపోవడంతో ఇక్కడకు వైద్యం కోసం వచ్చే మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇక మహిళలకు టెస్ట్స్ నిర్వహించే సమయంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పురుష సిబ్బంది బయటకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. పైకప్పుకు రంధ్రాలు ఏర్పడటంతో పందికొక్కులు, ఎలుకలు లోపలకి వెళ్లి ఫైల్స్, మెడిసిన్స్, వైద్య పరికరాలను ధ్వంసం చేస్తున్నాయి. ఏండ్ల కిందట ఏర్పాటు చేసిన యూపీహెచ్సీకి కనీసం వాచ్మెన్ కూడా లేకపోవడం శోచనీయం.
చెట్టు కింద, పార్కులోనే విధులు
ఒక్క రోగులే కాకుండా ఇక్కడ డాక్టర్స్, ఆశావర్కర్స్, ఏఎన్ఎంలు కూడా సదుపాయాల్లేక ప్రత్యక్షంగా ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. వీరు ఆస్పత్రికి ఎదుట ఉన్న చెట్లు, పక్కనే ఉన్న పార్కులో విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. నిత్యం ప్రజల్లో ఉంటున్నామని చెప్పుకునే స్థానిక ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న బాత్రూమ్కు కనీసం డోర్ ఏర్పాటు చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా వైద్యాధికారి స్పందించి ఇక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానికులు, రోగులు కోరుతున్నారు.
పక్కా భవనం నిర్మించాలి
సర్కార్ దవాఖానాలకు వైద్యం కోసం వచ్చే పేదలకు మౌలిక వసతులు కల్పించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫల మైంది. యూపీహెచ్సీని రేకుల షెడ్డులో నిర్వహిస్తుండటంతో రోగులు, డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. యూపీహెచ్ీకి పక్కా భవనాన్ని వెంటనే నిర్మించాలి. తక్షణమే బాత్రూమ్స్, పై కప్పు మరమ్మతులు చేపట్టి, కుర్చీలు ఏర్పాటు చేయాలి. లేకపోతే సీఐటీయూ, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దశల వారీగా పోరాటం చేస్తాం.
-టి.మహేందర్, సీపీఐ(ఎం) జోన్ నేత