Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ఆగస్టు 10 వరకు కార్యక్రమాలు
- విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఇండ్ల దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని నేటి నుంచి ఆగస్టు 10 వరకు నగరవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ప్రకటించారు. కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌రావు, ఎం.దశరథ్, ఎం.మహేందర్‌లతో కలిసి ఆదివారం ఆ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ ఎనిమిదేండ్ల కాలంలో నగంలో పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వాగ్ధానం చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న పరిస్థితి ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఇండ్ల కోసం మీసేవాల ద్వారా 7లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, కలెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వాళ్ల సంఖ్య భారీగా ఉందన్నారు. ఎన్నికల సమయాల్లో మాత్రమే ఇండ్లు ఇస్తున్నట్టు హడావుడి చేస్తూ మళ్లీ ఎన్నికల దాకా సర్కార్ కాలయాన చేస్తోందని విమర్శించారు. త్వరలో ఇండ్లను దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు అధికారులు ప్రకటించినప్పటికీ కలెక్టర్ కార్యాలయాల్లో దాఖలు చేసిన దరఖాస్తుల గురించి స్పష్టత ఇవ్వడంలేదన్నారు. అన్ని దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను వెంటనే ప్రకటించాలని, వారికి ఇండ్లను కేటాయించాలని, ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని పేదలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నగర శివారులో 80వేల ఇండ్లను పూర్తిచేసిన రెండేండ్లు గడుస్తున్నా వాటిని కేటాయించకుండ సర్కార్ తాత్సారం చేస్తోందన్నారు. బస్తీల్లో గుడిసెలను తొలగించి నిర్మించిన కొద్దిపాటి ఇండ్లను అప్పుడప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని అన్నారు. అనేక ప్రాంతాల్లో గుడిసెవాసులు కనీస వసతులు లేక దుర్బరస్థితిలో బతుకుతున్నారని, గుడిసెవాసుల ప్రాంతాల్లో ఇండ్ల పట్టాలిచ్చి అభివృద్ధి చేస్తారా? గృహ నిర్మాణం చేపడతారా? అనే విషయాలు తేల్చకుండ ప్రభుత్వం మీనామేషాలు లెక్కిస్తోందన్నారు. నగరంలో అనేక బస్తీలు దశాబ్దాల కాలం కిందటే ఏర్పడిన్పటికీ ప్రభుత్వం పట్టాలివ్వలేదని చెప్పారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు జిఓ నెం.58కింద పట్టాలిచ్చినప్పటికీ ఎన్నికల తర్వాత ఆపేశారని గుర్తుచేశారు. ఇటివలే మళ్లీ పట్టాలిస్తామని జిఓను జారీచేశారని, అర్హులైన బస్తీవాసులందరికి జీఓ నెం.58 కింద ఇండ్ల పట్టాలివ్వాలని, పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. 2005లో ప్రారంభించిన రాజీవ్ గృహకల్ప స్కీం లబ్ధిదారులకు నేటికీ ఇల్లు దొరకలేదని, ఇండ్ల కేటాయింపులో వీరికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సొంతంగా జాగా ఉండి ఇంటిని నిర్మించుకోవాలనుకునే పేదలకు రూ.3లక్షల సహాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ నేటికీ అమలు జరగలేదని చెప్పారు. నగరంలో రూ.3లక్షలతో ఇంటిని నిర్మించుకోవడం సాధ్యమేనా? కనీసం రూ.10 లక్షలు కేటాయించాలని, తక్షణ ఈ పథకాన్ని అమలు చేయడానికి సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.