Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-ముషీరాబాద్
తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలికి, సమాన అవకాశాలు ఉండే బహుజన రాజ్యాన్ని నిర్మించుకోవాలని, అందుకు బహుజనులంతా తెగించి రాజకీయ పోరాటంలో గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మన సంక్షేమానికి వినియోగించాల్సిన నిధులను పక్కదారి పట్టించి, లక్షల కోట్ల రూపాయలను ఆధిపత్య వర్గాలకు మళ్లిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బహుజన విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన మేధో మధన సదస్సు కన్వీనర్ ఎంఏ మాలిక్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. సదస్సులో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బహుజనులను నిరంతరం మోసగించేందుకు మన మెదళ్లను డైవర్ట్ చేసేందుకు పాలకవర్గాలు ఆహోరాత్రులు మేధోమధనం చేస్తున్నారని, ఆ క్రమంలోనే మమతా బెనర్జీకి, మంత్రి కేటీ రామారావుకు కాలు విరిగినట్టు వ్యాఖ్యలు చేశారు. రాత్రి పూట రాజకీయాలు చేసే పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను బహుజన వాదంలోకి వచ్చేలా చైతన్యం చేయాలన్నారు. ఇన్నాళ్లు మోసపోయం ఇంకా మోసపోతే తప్పు మనదే అవుతోందన్నారు. రానున్న రోజుల్లో ప్రగతి భవన్‌లోని ఆడిటోరియంలో బహుజన మేధో మధన సదస్సు నిర్వహించుకోవాలన్నారు. రాష్ట్రపతి మాజీ ఓఎన్డీ సత్యనారాయణ సాహు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రాధాన్యతను బహుజనులు గుర్తించాలన్నారు. ఈనాటి పాలకులు క్రమంగా రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ విద్యా వికాసం ద్వారానే సామాజిక అభివద్ధి సాధ్యం అవుతోందని అన్నారు. విద్యకు అధిక బడ్జెట్ కేటాయించకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. సదస్సులో రిటైర్డ్ తహసీల్దార్ బాలరాజు, డాక్టర్ అలీంఖాన్ ఫలాకీ, డాక్టర్ ఎన్. తిరుపతి, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, బహుజన విద్యావంతుల వేదిక కన్వీనర్లు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, ఎంఏ మాలిక్, ప్రొఫెసర్ రామకృష్ణ, బహుజన వాగ్గేయకారుడు మచ్చ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.