Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
కుల అసమానత నిర్మూలన పోరాటసమితి వ్యవస్థాపకులు ఉ.సా(సాంబశివరావు రెండో సంస్మరణ సభ సుల్తాన్‌బజార్‌లోని బీసీ భవన్లో సోమవారం జరిగింది. సంస్థ రాష్ట్ర కన్వీనర్ గురిమిళ్ల రాజు అధ్యక్షత వహించిన సభలో ముఖ్య వక్తలుగా ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ కె.చక్రధర్ రావ్, హెచ్‌సీయూ ప్రొఫెసర్ కె.వై.రత్నం, రచయిత ఇంద్రవెల్లి రమేష్, కుల నిర్మూలన సంఘం నాయకులు సీఎల్ఎన్.గాంధీ, ప్రముఖ సామాజిక విశ్లేషకులు జంగా గౌతమ్, ఎదురీత సంపాదక వర్గసభ్యులు కె.జె.రామారావు, సామాజిక తెలంగాణ నాయకులు కొత్తగట్టు మల్లన్న, సామాజిక ఆంధ్ర నాయకులు చెముకుల సుధాకర్, సావిత్రి పూలే మహిళా సంఘం అధ్యక్షురాలు గన్నారపు సరోజన, విద్యార్థి సంఘనాయకులు ఎ.క్రాంతి కిరణ్, ఆల్ఇండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించారు. ఉ.సా లాంటి సజీవ మేధావి (ఆర్గానిక్ ఇంటలెక్చువల్) కరోనాతో మరణించడం వల్ల సమాజానికి, భవిషత్ తరాలకు తీరనిలోటు ఏర్పడిందన్నారు. 1970లో ప్రారంభమైన ఆయన విద్యార్థి ఉద్యమ జీవితం, నాస్తికవాద, హేతువాద, మానవతావాద ఉద్యమాల గుండా ప్రయాణించి విప్లవోద్యమంలోకి అడుగు పెట్టిందన్నారు. కమ్యూనిస్టు కార్యకర్తగా దశాబ్దకాలం ఎంఎల్ పార్టీలో అంకితభావంతో పనిచేశారని, కారంచేడు సంఘటన దేశ రాజకీయాలను మలుపు తిప్పినట్లే, ఉ.సా ఉద్యమ జీవితాన్ని కూడా మలుపు తిప్పిందన్నారు. ఈదేశ సామాజిక వ్యవస్థ నిర్దిష్ట రూపమైన 'కులం'ను బహిరంగపరచిన కారంచేడు సంఘటనను 'మాదిగలపై కమ్మకుల దురహంకారుల దాడి'గా ఆయన ప్రకటించారన్నారు. తెలంగాణ ప్రాంతీయ, ప్రజాస్వామ్య ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తూ సామాజిక సమన్యాయం కోసం పోరాడన్నారు. ఉద్యమాల ఉపాధ్యాయుడు, .కవి, కళాకారుడు, రచయిత, జర్నలిస్టు అని ఇలా బహుముఖ పాత్రలను ఒకే వ్యక్తి పోషించి మెప్పించారన్నారు. అనంతరం ఉ.సా ఆశయాలను కొనసాగిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కుల అసమానత నిర్మూలన పోరాట సమితి కోకన్వీనర్ చక్రవర్తి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.