Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడిక్కడ అపరిశుబ్రతతో, రోడ్లపై మురుగుతో ప్రజల అవస్థలు
- రోగాలు ప్రబలే అవకాశంతో జనం ఆందోళన
- వెనువెంటనే చర్యలు తీసుకోకపోతే రోగాలు విస్తరించే అవకాశం !
నవతెలంగాణ-బంజారాహిల్స్/మేడ్చల్ కలెక్టరేట్
ఓ వైపు భారీ వర్షాలతో, వర్షాలు తగిని అవి మిగిల్చిన కష్టాలతో గ్రేటర్ పరిధిలోని పలుచోట్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎడతెరిలేని వానలవల్ల రోడ్లపై, కాలనీల్లో, గుంతల్లో, డ్రయినేజీల్లో నీరు నిండి, మురుగుపారి చాలాచోట్ల అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. పారిశుధ్య సిబ్బంది క్లీన్ చేద్దామనే సరికి మళ్లీ వర్షం రావడంవల్లో, కొన్నిచోట్ల క్లీన్ చేయకపోవడంవల్లో సమస్య ఏర్పడుతోంది. ప్రకృతిపరమైన సమస్య ఒకటైతే, జీహెచ్ఎంసీ, వాటర్బోర్డు, సంబంధింత అధికారులు నిర్లక్ష్యం కూడా మరో సమస్యగా మారుతోంది. ఎపపటికప్పుడు సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నచోట్ల కూడా అధికారులు స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. గుంతలు ఏర్పడ్డాయి. గుంతల్లో నీరు నిలవడంతో ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ నీటిని తొలగించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బేగంపేట్, కుత్బుల్లాపూర్ మేడ్చల్, కీసర తదితర ప్రాంతాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇంకొన్నిచోట్ల డ్రయినేజీలు పొంగి రోడ్లపై ప్రవహిస్తుండటంతో మురుగు పేరుకుపోతోంది. దుర్వాసన వెదజల్లుతోంది. ఈగలు, దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. రోగాలు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు, రాకపోకలు సాగించే వారు ఆందోళన చెందుతున్నారు. కీసర సంత జరిగే ప్రదేశంలో పేరుకుపోయిన బురద, మురుగు ఇందుకు చక్కటి నిదర్శనంగా చెప్పొచ్చు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో...
ఖైరతాబాద్ డివిజన్లో సోమాజిగూడ, వెంకటేశ్వర కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ డివిజన్ల పరిధిలో పలుచోట్ల మురుగునీరు నిలిచి ఇబ్బంది కంరగా మారింది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. డ్రయినేజీలు పొంగుతున్నాయని వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేస్తే వర్షాల కారణంగా కాంట్రాక్టర్లు, సిబ్బంది రావడం రాలేదనేసమాధానం వస్తోందంటున్నారు. వర్షాల కారణంగా అత్యధికంగా పంజాగుట్ట రోడ్డులో ప్రవహిస్తోంది. ఇది పత్రికల్లో రావడంతో తాత్కాలికంగా పరిష్కరించారు. వర్షంవల్ల ఏర్పడిన ఇబ్బందులను, ముఖ్యంగా మురుగును తొలగించకపోతే రోగాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలే కాదు, వైద్యులు కూడా పేర్కొంటున్నారు. దోమలు, ఈగలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉందని, పరిశుభ్రత పాటించాలని చెప్తున్నారు.
కీసర సంతలో పారిశుధ్య లోపం
కీసర మండల కేంద్రంలోని వారాంతపు సంతలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. మురుగు పేరుకుపోవడంతో దోమలు పెరుగుతున్నాయి. రోగాలు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలవల్ల ఏర్పడే సమస్యను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో విఫలం అవుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఎడతెరపిలేని వర్షావల్ల కీసర సంతకు వెళ్లే రోడ్డులో, సంతలో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. వర్షపు నీరు నిలిచింది. పరిసరాలు మరీ అధ్వానంగా మారిపోయాయి. మార్కెట్లో కూరగాయలు కొనేందుకు వచ్చిన ప్రజలు రోగాలు అంటించుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని మార్కెట్కు వచ్చిన పలువురు చర్చించుకుంటున్నారు. తై బజార్ నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ ఆదాయంపై దృష్టి పెట్టడమేగాక, ఇటువంటి సమస్యలపై కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నారు. అసలే వర్షాకాలం, మురుగువల్ల, గుంతల్లో నీరు పేరుకుపోవడంవల్ల దోమలు పెరిగి, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కీసర ప్రధాన కూడలి నుండి మార్కెట్ వరకు వ్యాపారులు సంతరోజు దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు. మండలంలోని అంకిరెడ్డి పల్లి, బోగారం, వణ్ణిగూడెం, దాయరా, కీసర గుట్ట, యాదగర్పల్లి తదితర గ్రామాల ప్రజలు, ఇటుక బట్టి, స్టోన్ క్రషర్, భవన నిర్మాణ కార్మికులు తదితరులు వందలాదిగా ఇక్కడి సంతకు వస్తుంటారు. ఇక్కడ కనీస సౌకర్యలైన పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం, మరోవైపు అపరిశుభ్ర వాతావరణంతో అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు పారిశుధ్య నిర్వహణపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.