Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పాత పద్దతిలోనే పీహెచ్డీ అడ్మిషనన్లు కల్పించాలంటూ మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. సోమవారం ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ ఓయూ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, పాత పద్ధతిలోనే నిర్వహించాలనే డిమాండ్‌తో ఉద్యమిస్తున్న విద్యార్థులపై ఈనెల 23 ఓయూ వీసీ రవీందర్ పోలీసులు, ప్రయివేట్ సైన్యం సాయంతో దాడిచేయించారన్నారు. ఈ దాడిలో చాలామంది విద్యార్థులకు గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. 'పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల, పాత పద్ధతిలో నిర్వహణ, ఓయూలో మౌలిక వసతుల కల్పన' అనే డిమాండ్‌తో ప్రజాస్వామ్యబద్దంగా వినతిపత్రాలు ఇవ్వడానికి వెళ్లిన విద్యార్థులపై వీసీ ఒక నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు ఇవ్వాలన్న తాజా నిర్ణయంతో.. యూజీసీ ఫెలోషిప్ ఉన్న అనేక మంది నష్టపోతారన్నారు. విద్యార్థులపై వీసీ దాడికి, ఆయన అహంకార పూరిత వైఖరికి నిరసనగా మంగళవారం ఓయూ బంద్‌కి పిలుపునిస్తున్నట్లు తెలియజేశారు. శాంతియుతంగా నిర్వహించతలపెట్టిన బంద్‌కి అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు, పోలీసులు అందరూ సహకరించాలని కోరారు. సమావేశంలో ఓయూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.